Cyber Cheating : ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.9.5 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

ఆన్‌లైన్‌లో ఫ్లైట్  టికెట్  బుక్ చేసుకున్న వ్యాపారి ఖాతా నుంచి సైబర్  నేరస్తులు రూ. 9.5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

Cyber Cheating : ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తే రూ.9.5 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

Cyber Crime Guntur

Updated On : November 26, 2021 / 1:52 PM IST

Cyber Cheating : ఆన్‌లైన్‌లో ఫ్లైట్  టికెట్  బుక్ చేసుకున్న వ్యాపారి ఖాతా నుంచి సైబర్  నేరస్తులు రూ. 9.5 లక్షల రూపాయలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.   మాచవరం మండలం గంగిరెడ్డిపాలెం‌కి    చెందిన ప్రముఖ వ్యాపారి చిట్టిప్రోలు నరసింహారావు విదేశాలకు వెళ్లేందుకు ఈరోజు ఉదయం ఆన్ లైన్ లో    ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అందుకు గానూ అతని బ్యాంకు ఎకౌంట్ నుంచి రూ. 12,500 లు నగదు విత్‌డ్రా  అయ్యింది.

బ్యాంకు  ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా  అయినా  టికెట్ డౌన్లోడు కాలేదు. ఏమైనా సమస్య ఉందేమోనని కస్టమర్ కేర్ కు  ఫోన్  చేయగా అతను ఒక యాప్ డౌన్లోడు చేసుకోమని చెప్పాడు. అది నిజమైన కస్టమర్ కేర్ సెంటర్   అనుకుని అవతలి వ్యక్తి   చెప్పిన యాప్ డౌన్లోడు చేసుకున్నాడు  నరసింహారావు.

ఆ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత అందులో అడిగిన విధంగా ఎకౌంట్ వివరాలు ఎంటర్ చేశాడు. ఎంటర్ చేసిన 5 నిమిషాల్లో అతని  బ్యాంక్  ఎకౌంట్ నుంచి రూ.9,50,000 విత్ డ్రా అయ్యాయి. వెంటనే అనుమానం వచ్చిన నరసింహరావు బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేసి తన ఖాతాలను ఫ్రీజ్ చేయాలని కోరాడు.

Also Read : TDP Woman Leader Suicide Attempt : పోలీసుల వేధింపులు భరించలేక టీడీపీ నాయకురాలు ఆత్మహత్యాయత్నం

బ్యాంక్ మేనేజర్ వెంటనే నరసింహారావుకు   చెందిన అకౌంట్లు ఫ్రీజ్ చేశాడు.  ఎకౌంట్లు ఫ్రీజ్ చేయకపోతే ఇంకా ఎక్కువ మొత్తంలో   డబ్బులు మాయం అయ్యేవని ఆవేదన వ్యక్తం చేశాడు.  బాధితుడు వెంటనే మాచవరం పోలీసు స్టేషన్‌కు   వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.