అప్పుతీర్చలేదని దళిత సర్పంచ్ భర్త సజీవ దహనం

  • Published By: bheemraj ,Published On : November 1, 2020 / 03:10 AM IST
అప్పుతీర్చలేదని దళిత సర్పంచ్ భర్త సజీవ దహనం

Updated On : November 1, 2020 / 7:27 AM IST

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అప్పు తీర్చలేదనే నేపంతో కొందరు వ్యక్తులు దళిత సర్పంచ్ భర్తను సజీవ దహనం చేశారు. ఈ ఘటన అమేథీలోని మున్షిగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బందోయియా గ్రామానికి చెందిన అర్జున్‌ కోరి(40)కి.. మరి కొందరికి మధ్య డబ్బుకు సంబంధించి వివాదం తలెత్తింది. ఈ క్రమంలో గురువారం ఐదారుగురు వ్యక్తులు కలిసి అర్జున్‌ కోరిని చంపేందుకు ప్రయత్నించారు. బతికి ఉండగానే అతడిని సజీవ దహనం చేయాలని భావించి నిప్పుపెట్టారు.



రాత్రి 10:30 గంటల ప్రాంతంలో బాధితుడి ఇంటి సరిహద్దు ప్రాంతంలో కాలిపోయిన స్థితిలో ఉన్న అర్జున్‌ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే అతడిని చికిత్స కోసం నౌగిర్వాలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు అతడిని సుల్తాన్‌పూర్‌ జిల్లా ఆస్పత్రికి అక్కడి నుంచి లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. కానీ ఆస్పత్రికి చేరేలోపే అతను మృతి చెందాడు.



గ్రామ పెద్ద, బాధితుడి భార్య ప్రత్యర్థులే ఈ హత్య చేశారని తెలిపింది. ఐదురుగిరిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గ్రామ పంచాయతీ సభ్యులు మాత్రం డబ్బుల కోసమే అర్జున్‌ కోరిని హత్య చేశారని తెలిపారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు.

పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘విషయం తెలిసిన వెంటనే మేం సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామ్‌ ప్రధాన్‌ భర్తను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించాము. లక్నో ట్రామా సెంటర్‌కు తీసుకెళ్తుండగా.. అతడు మరణించాడు’ అని తెలిపారు. బాధితుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిలో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు.