విశాఖ ఏజెన్సీలో గంజాయి ద్రావణం స్వాధీనం

విశాఖ మన్యంలో తయారు చేస్తున్న గంజాయి ద్రావకాన్ని ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.25 లక్షల వరకు ఉంటుందని అంచనా. గంజాయి నిల్వ చేసిన చిన్నారావు అనే వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు. అధికారులు నిరంతర నిఘా ఉన్నప్పటికీ విశాఖ మన్యంలో గంజాయి సాగు, రవాణాను అరికట్టలేక పోతున్నారు. అటు సాగుదారులు, ఇటు రవాణా దారులు ఎక్కడా వెనకడుగు వేయటంలేదు.
వివిధ మార్గాల్లో మైదాన ప్రాంతాలకు, అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. కొద్ది రోజుల కిందట సీలేరు నుంచి హైదరాబాద్ కు అక్కడి నుంచి తమిళనాడు, శ్రీలంకకు రవాణా చేస్తున్న గంజాయిని మహబూబ్ నగర్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఏజెన్సీలోని చింతపల్లి మండలం కుడుమసారి పంచాయతీ పరిధిలోని బొడ్డాపుట్టు గ్రామంలో పెద్ద ఎత్తున గంజాయి నిల్వలను ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడిలో రవాణాకు సిధ్దంగా ఉన్న 240 కిలోల ఎండు గంజాయి తోపాటు, పచ్చి గంజాయి నుంచి తయారు చేసిన ముడి ద్రావణాన్ని సీజ్ చేశారు. బొడ్డాపుట్ట గ్రామంలో ఒక ఇంట్లో గంజాయి నిల్వలు ఉన్నట్లు అందినవిశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు దాడులు చేసి వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పచ్చి గంజాయి నుంచి తయారు చేస్తున్న 41 కేజీల ద్రావణాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ద్రావణం తయారు చేయటానికి ఉపయోగిస్తున్న పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పచ్చి గంజాయిలో పెట్రోలియం ఈథర్ అనే రసాయనాన్ని కలిపి గంజాయి ద్రావణాన్ని తయారు చేస్తున్నారు. కేజీ ద్రావణం తయారు చేయటానికి 15 నుంచి 20 కేజీల పచ్చి గంజాయి అవసరం అవుతుందని అధికారులు తెలిపారు. దీన్ని చాక్ లెట్లు, సిగరెట్లలో కలిపి కాలేజి స్టూడెంట్స్ కు ,యూత్ కు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.