సింగరేణి ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం : నలుగురు కార్మికులు మృతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేళ సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రమంతా ఒక పక్క వేడుకలు జరుగుతుంటే పెద్దపెల్లి జిల్లా, సింగరేణి రామగుండం, రీజియన్ ఓపెన్ కాస్ట్ -1 ప్రాజెక్ట్ లో మహాలక్ష్మి కంపెనీ ఓబిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
బొగ్గు తవ్వకాల్లో భాగంగా ఓపెన్ కాస్ట్ -1 వద్ద ఏర్పాటు చేసిన పేలుడు పదార్ధాలు మిస్ ఫైర్ అయ్యాయి.దీంతో ప్రాజెక్టులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ భారీ పేలుడు ఘటనలో నలుగురు కాంట్రాక్ట్ కార్మికులు మృతిచెందారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా ఉంది. గాయపడిన వారిని గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు.
మహాలక్ష్మి ఓబీ కంపెనీలో బ్లాస్టింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సాధారణంగా బ్లాస్టింగ్ పనులు సాయంత్రం పూట చేస్తూ ఉంటారు. అయితే ఉదయం సమయంలో మందు గుండును ఓబీ కుప్పల్లో అమరుస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో నలుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. సంఘటన విషయం తెలిసిన వెంటనే పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే చందర్, కాంగ్రెస్ నేత మక్కన్ సింగ్,మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణలతోపాటు కార్మిక సంఘాల నాయకులు సంఘటన గురించి అధికాలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
మృతుల్లో ఇద్దరు రాకేష్, ప్రవీణ్ కుమార్ గోదావరి ఖనికి చెందినవారిగా గుర్తించారు. మరోకరు కమాన్ పూర్ కు చెందిన రాజేష్ కాగా, మరోకరు రత్నాపూర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పేలుళ్ల దాటికి కార్మికుల మృతదేహాలు చిద్రమయ్యాయి. దీంతో శరీర భాగాలను సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్ధలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్ధలాన్ని పరిశీలించారు. సింగరేణి అధికారులను, ఉద్యోగులను ప్రశ్నించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
Read: ప్రగతి పథంలో దూసుకెళ్తూ దేశానికే దిక్సూచిలా తెలంగాణ