ఐటీ శాఖకు నయీం కేసు..హసీనాను విచారించిన అధికారులు

  • Published By: madhu ,Published On : November 27, 2019 / 10:04 AM IST
ఐటీ శాఖకు నయీం కేసు..హసీనాను విచారించిన అధికారులు

Updated On : November 27, 2019 / 10:04 AM IST

గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసు కీలక మలుపు తీసుకుంది. ఇతనికి సంబంధించిన ఆస్తుల కేసు ఐటీ శాఖకు చేరింది. ఆస్తుల వివరాలు ఇవ్వాలని పోలీసును ఐటీ శాఖ అధికారులు కోరారు. నయీమ్ భార్య హసీనా బేగంను ఐటీ అధికారులు విచారించారు. 2019, నవంబర్ 27వ తేదీ బుధవారం జరిగిన ఈ విచారణలో హసీనా ఆస్తులకు సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడించినట్లు తెలుస్తోంది.

టైలరింగ్ ద్వారా ఆస్తులు సంపాదించినట్లు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా హసీనా స్టేట్ మెంట్ రికార్డు చేశారు ఐటీ శాఖ అధికారులు. నయీం ఎన్ కౌంటర్ అనంతరం వేల కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎన్ని ప్రాపర్టీలు సీజ్ చేశారనే దానిపై ఐటీ ఆరా తీస్తోంది. గత రెండు రోజులుగా హసీనాను విచారిస్తోంది. కొంతకాలంగా టైలరింగ్ చేస్తున్నట్లు, బట్టల వ్యాపారం ద్వారా ఆస్తులు సంపాదించినట్లు విచారణలో హసినా వెల్లడించినట్లు సమాచారం. 

మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్ వద్దనున్న మిలినియం టౌన్ షిప్‌లో తలదాచుకున్న నయీమ్ పోలీసుల ఎన్ కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. 2016 ఆగస్టు 08వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం అతడికి సంబంధించిన ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో సోదాలు చేయగా..పెద్ద ఎత్తున ఆస్తిపత్రాలు లభ్యమయ్యాయి. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈ కేసును సిట్ అధికారులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. చాలా మందిని బెదిరించి భూ కబ్జాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. కనిపించిన స్థలాన్ని కబ్జా చేయడం..లేదంటే కడతేర్చడం వంటివి నయీమ్ చేసేవాడని దర్యాప్తులో తేలింది. ఎవరూ ఊహించనన్నీ ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. దాదాపు 293 కేసులు నమోదైనట్లు టాక్. తాజాగా ఐటీ అధికారుల విచారణలో ఎన్ని ఆస్తులున్నాయో లెక్కతేలనుంది. 
Read More : ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ : వేతనాలపై హైకోర్టులో విచారణ