ఐదుగురు అక్కాచెల్లెల్లపై దొంగబాబా లైంగిక వేధింపులు, అత్యాచారం, చిన్న అమ్మాయికి 10ఏళ్లే!

స్వయం ప్రకటిత భగవాన్‌గా చెప్పుకునే దొంగబాబా 10-19 ఏళ్ల మధ్య వయస్సున్న ఐదుగురు అక్కాచెల్లలపై అత్యాచారం చేసి.. ఆపై లైంగికంగా వేధించినందుకు పుణె పోలీసులు అరెస్ట్ చేశారు. పింప్రి చించువాడ్‌లో నివాసముంటున్న బాధితురాళ్లను గర్భం దాల్చకుండా ఎవరో చేతబడి చేశారని, దీనికి విరుగుడిగా ఇంట్లో ఓ ఆచార కర్మ నిర్వహించాలని, ఇంట్లో దాచిన నిధిని కూడా బయటకు తీసేందుకు సాయం చేస్తానని వారిని నమ్మించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఆ ఐదుగురు బాధితుల సోదరి ఒకరు స్వయం ప్రకటిత భగవాన్ సోమనాథ్ చావన్ (32)పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు సోమనాథ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
22ఏళ్ల యువతి ఫిర్యాదు ప్రకారం.. తన సోదరీలు గర్భం దాల్చకుండా ఎవరో తమ కుటుంబంపై చేతబడి చేశారని సోమనాథ్ నమ్మించినట్టు ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు.. మీ సోదరీల్లో ఒకరు ప్రమాదంలో ఉన్నారని, వారిని రక్షించాలంటే తప్పనిసరిగా ఇంట్లో ఓ ఆచార కర్మను నిర్వహించాలని, అలాగే ఇంట్లో దాచిన నిధి కూడా బయట పడేలా సాయపడతానని బాధిత కుటుంబాన్ని సోమనాథ్ నమ్మించినట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక కర్మను నిర్వహించడానికి రూ.3లక్షలు డిమాండ్ చేసినట్టు అధికారి వెల్లడించారు.
బాధిత యువతులపై అత్యాచారం చేయడమే కాకుండా లైంగికంగా వేధిస్తున్నాడు. దీనిపై ఎవరికైనా చెబితే మీ అమ్మాయిలను చంపేస్తానంటూ వారి తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. ఐదుగురిలో ఒకరిని దొంగ పెళ్లి కూడా చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడు సోమనాథ్ చావన్ ను పలు సెక్షన్ల కింద అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారి తెలిపారు. మహారాష్ట్ర అంధాశార్దా నిర్మూలన్ సమితికి చెందిన సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.