అమ్మాయిల కిడ్నాప్ కేసు తర్వాత విదేశాలకు పారిపోయిన రాసలీలల స్వామి

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త నిత్యానందపై గుజరాత్ పోలీసులు బుధవారం, నవంబర్ 20న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిత్యానందకు చెందిన అహ్మదాబాద్ లోని యోగిని సర్వజ్ఞపీఠం ఆశ్రమంలో నలుగురు చిన్నారులను విరాళాల సేకరణకు ఉపయోగించుకుంటూ వారిని దిగ్బంధించారనే ఆరోపణలతో నిత్యానందపై కేసు నమోదు చేశారు. మరోవైపు నిత్యానంద శిష్యులు సాధ్వి ప్రణ్ ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు చిన్నారులను కిడ్నాప్ చేసి, బాల కార్మికులుగా వారితో పనిచేయిస్తున్నారనే ఆరోపణలపై వారిని అరెస్ట్ చేశారు.
ఆశ్రమంలో సోదాలు నిర్వహించిన పోలీసులు నలుగురు చిన్నారులను రక్షించారు. వారిచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా నిత్యానందపై కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైన సంగతి తెలిసిన నిత్యానంద విదేశాలకు పరారైనట్లు అహ్మదాబాద్ ఎస్పీ ఆర్వీ అసారి చెప్పారు. యోగిని సర్వజ్ఞపీఠాన్ని నిత్యానంద తరుఫున ఆయన శిష్యురాళ్లు సాధ్వి ప్రణ్ ప్రియానంద, సాధ్వి ప్రియతత్వ రిధి కిరణ్‌లు నిర్వహిస్తున్నారని పోలీసుల చెప్పారు.
చిన్నారుల తల్లితండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఆశ్రమంలో సాగుతున్న వ్యవహారం బట్టబయలైంది. మరోవైపు ఆశ్రమంలో నిర్బంధించిన తమ కుమార్తెలను విడిపించాలని జనార్ధన శర్మ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెలను కలిసేందుకు కూడా ఆశ్రమ నిర్వాహకులు అనుమతించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు నకిలీ పాస్‌పోర్ట్‌పై నిత్యానంద నేపాల్‌లో తలదాచుకుంటున్నట్లు తెలిసింది. స్వామి నిత్యానంద పేరు చెప్పగానే తమిళ సినీ నటి రంజితతో ఆయన జరిపిన రాసలీలలు వీడియో గుర్తుకు వస్తుంది. వీరిద్దరూ ఆశ్రమంలోని గదిలో ఏకాంతంగా గడిపిన వీడియో వెలుగులోకి రావడం 2010లో సంచలనం రేపింది.