ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

family of 5 commits suicide in tamilnadu : తమిళనాడులో దారుణం జరిగింది. వడ్డీవ్యాపారుల వేధింపులు తాళలేక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని వడ్డీ వ్యాపారులు వత్తిడి చేయటంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ముగ్గురు పిల్లలతో కలిసి దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. విల్లుపురం జిల్లాలోని పుదుపాలెంలో ఈఘటన జరిగింది.
పుదుపాలెంలో చిరు వ్యాపారం చేసుకునే మోహన్ అనే వ్యక్తి గత కొంతకాలంగా వ్యాపారం అభివృధ్ది కోసం అప్పులు చేశాడు. దాదాపు మూడున్నర లక్షల రూపాయలు అప్పులు చేసాడు. స్ధానికంగా ఉన్న కాల్ మనీ వ్యాపారుల రూల్స్ ప్రకారం ఒక వారం డబ్బు చెల్లించలేకపోతే మరుసటి వారానికి అప్పు రెట్టింపు అవుతుంది.
ఈక్రమంలో బాధితుడు మోహన్ తీసుకున్న అప్పు పెరిగి పోవటం.. అప్పు తీర్చే మార్గం కనపడక పోవటం…. వడ్డీ వ్యాపారులు వత్తిడి పెరిగిపోవటంతో మోహన్ కుటుంబం సోమవారం తెల్లవారుఝూమున ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది, మొదట పిల్లలను చంపేసి..అనంతరం భార్య భర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా వడ్డీ వ్యాపారులు మోహన్ ను హెచ్చరిస్తూ వచ్చారు.
ఈ నేపధ్యంలో వడ్డీ వ్యాపరస్తుల వేధింపులు భరించలేక మోహన్, భార్య లత సోమవారం తెల్లవారుఝూమున ఈదారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనతో పుదుపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న విల్లుపురం పోలీసులు విచారణ చేపట్టారు.