బావి కాదు డెడ్‌బాడీల డెన్ : ఆ బావి నుంచి రెండో మృతదేహం వెలికితీత

యాద్రాది భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ లో మర్డర్ మిస్టరీలు కలకలం సృష్టిస్తున్నాయి. టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రావణి మృతదేహం దొరికిన బావిలోనే మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతురాలిని డిగ్రీ యువతి మనీషగా గుర్తించారు. మనీష కేఎల్ఆర్ డిగ్రీ కాలేజీలో బీకాం విద్యార్థిని. మనీష నెల రోజుల క్రితం తప్పిపోయింది. ఆమెను ఎవరో దారుణంగా మర్డర్ చేసి బావిలో పూడ్చిపెట్టారు. శ్రావణిని పూడ్చిపెట్టిన బావిలోనే మనీషను పూడ్చిపెట్టారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు మనీష మృతదేహాన్ని వెలికితీశారు. టెన్త్ విద్యార్థిని శ్రావణి హత్య కేసులో పోలీసులు 15మందిని అదుపులోకి తీసుకున్నారు. హాజీపూర్ కి చెందిన ఏడుగురిని, బొమ్మలరామారానికి చెందిన 8మందిని అరెస్ట్ చేశారు. విచారణలో ఆ 15మంది నుంచి రాబట్టిన సమాచారంతోనే పోలీసులు రెండో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు.
మనీష మార్చిలో అదృశ్యమైంది. ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? అనేది తల్లిదండ్రులు తెలుసుకోలేకపోయారు. చివరికి ఇలా మృతదేహమై కనిపించడంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు షాక్ తిన్నారు. బావిలో ఒక్కొక్కటిగా అమ్మాయిల మృతదేహాలు బయటపడుతుండటం కలకలం రేపుతోంది. మనీషకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి మనీష తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో తమ కూతురు అబ్బాయితో వెళ్లిపోయి పెళ్లి చేసుకుని ఉంటుందని కుటుంబసభ్యులు భావించారు. కానీ ఇలా డెడ్ బాడీ దొరికేసరికి వారు షాక్ తిన్నారు. బావిలో ఎముకలు మాత్రమే మిగిలాయి. వాటిని ఐదు సంచుల్లో సేకరించి భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొన్ని పరీక్షలు చేసి తర్వాత ల్యాబ్ కి పంపిస్తామని పోలీసులు చెప్పారు.
ఐడీ కార్డు, అక్కడ లభించిన బ్యాగు ఆధారంగా మృతదేహం మనీషదే అని పోలీసులు గుర్తించారు. సైంటిఫిక్ గా నిరూపించాల్సిన అవసరం ఉండటంతో డీఎన్ఏ టెస్టుకి ఏర్పాట్లు చేస్తున్నారు. తల్లి లేదా తండ్రి డీఎన్ఏతో పోల్చనున్నారు. హాజీపూర్ గ్రామానికి చెందిన 6వ తరగతి విద్యార్థిని కల్పన 2015లో మిస్ అయ్యింది. ఆ బాలిక గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. పోలీసుల తీరుపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు వస్తున్నాయి. శ్రావణి మృతదేహం వెలికితీసే సమయంలో ఆ బావిని పోలీసులు పరిశీలించి ఉంటే అప్పుడే మనీష మృతదేహం బయటపడేదని అంటున్నారు. కానీ పోలీసులు అలాంటి ప్రయత్నమే చెయ్యలేదని గ్రామస్తులు మండిపడ్డారు.