ప్రియుడి శాడిజం.. వేధింపులు భరించలేక యువతి బలవన్మరణం
మొదట్లో ప్రేమ కురిపించిన ప్రేమికుడు తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరికి ముఖం చాటేశాడు.

బాలబోయిన అఖిల, ఓరుగంటి అఖిల్‌సాయిగౌడ్ (file photos)
hyderabad young woman tragedy: ప్రేమించానంటూ వెంటపడిన యువకుడిని గుడ్డిగా నమ్మడమే ఆ యువతి పాలిట శాపంగా మారింది. మొదట్లో ప్రేమ కురిపించిన ప్రేమికుడు తర్వాత తన నిజస్వరూపం బయటపెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చివరికి ముఖం చాటేశాడు. గట్టిగా అడిగితే శాడిజం చూపించాడు. ప్రేమికుడి నిజస్వరూపం బయట పడడంతో తట్టుకోలేక ప్రియురాలు ఈ లోకాన్ని వీడింది. 14 పేజీల సూసైడ్ లేఖ రాసి ప్రాణాలు తీసుకుంది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా గాజులరామారం రోడ్డులోని ఎన్‌ఎల్‌బీనగర్‌లో మంగళవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. యువతి తండ్రి బాలబోయిన కుమార్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రియుడి వేధింపులు తట్టుకోలేక బాలబోయిన అఖిల అనే 22 ఏళ్ల యువతి మంగళవారం రాత్రి 7.30గంటల సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
Also Read: ఖమ్మం జిల్లా కారు ప్రమాద ఘటనలో కొత్త ట్విస్ట్.. ”యాక్సిడెంట్ కాదు.. బావే చంపేశాడు”
ఓరుగంటి వెంకటేష్ గౌడ్ కుమారుడు అఖిల్‌సాయిగౌడ్ గత ఎనిమిదేళ్లుగా ప్రేమ పేరుతో అఖిలను వేధించాడు. ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో అతడి ప్రేమను అంగీకరించి.. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. సాయిగౌడ్ పెళ్లికి ఒప్పుకోవడంతో రెండు కుటుంబాలు వీరి ప్రేమకు అంగీకరించాయి. మొదట్లో బాగానే ఉన్న సాయిగౌడ్ తర్వాత అఖిలను వేధించడం మొదలుపెట్టాడు.
చాలాసార్లు అందరూ చూస్తుండగానే పబ్లిక్ లో ఆమెపై చేయి చేసుకున్నాడు. ప్రతిరోజు ఫోన్లో కూడా వేధించేవాడు. ప్రేమ పేరుతో అఖిల వెంటబడిన సాయిగౌడ్.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో మానసికంగా ఒత్తిడికి గురైన అఖిల బలవన్మరణానికి పాల్పడింది. తన కూతురిని అతి క్రూరంగా హింసించిన సాయిగౌడ్‌ను కఠినంగా శిక్షించాలని అఖిల తండ్రి తన ఫిర్యాదులో కోరారు.