అక్క కళ్లలో ఆనందం కోసం..! ఈ చెల్లి ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలిస్తే షాకే..!

కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

అక్క కళ్లలో ఆనందం కోసం..! ఈ చెల్లి ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో తెలిస్తే షాకే..!

Updated On : November 26, 2024 / 1:50 AM IST

Niloufer Infant Kidnap Case : ముగ్గురూ ఆడపిల్లలే. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే అక్కను బావ బతకనివ్వడు. కాబట్టి అక్క కళ్లలో ఆనందం చూడాలి. బావ, అక్క కాపురం సంతోషంగా ఉండాలి. ఇందుకు ఓ చెల్లి పనికిమాలిన ఐడియా వేసింది. అక్క బావలతో కలిసి ఆ ప్లాన్ ను అమలు చేసింది. కానీ, అది కాస్తా బెడిసి కొట్టింది. ఆ ముగ్గురు జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

నీలోఫర్ శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతం. హైదరాబాద్ లోని నీలో ఫర్ చిల్డ్రన్స్ హాస్పిటలో జరిగిన శిశువు కిడ్నాప్ కేసు సుఖాంతమైంది. బేబీని కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను షెహన్ షా బేగమ్, రేష్మా, అబ్దుల్లాగా గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం జహీరాబాద్ కు చెందిన హసీనా బేగం, గఫార్ భాష దంపతులకు నెల రోజుల క్రితం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మగశిశువు జన్మించాడు. చిన్నారి అనారోగ్యంతో బాధపడుతుండటంతో స్థానిక వైద్యుల సలహా మేరకు తల్లిదండ్రులు అక్టోబర్ 20న శిశువును నీలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

నెల రోజుల పాటు చికిత్స పొందిన శిశువును నవంబర్ 23న వైద్యులు డిశ్చార్జి చేశారు. దానికి ముందు శిశువు తల్లి, అమ్మమ్మ ఆరోగ్యశ్రీ వార్డుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడి నుంచి వచ్చిన బురఖా ధరించిన ఓ మహిళ వృద్ధురాలితో మాటలు కలిపింది. చిన్నారి ముద్దుగా ఉన్నాడంటూ చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత వృద్ధురాలి దృష్టి మరల్చి శిశువుతో పరారైంది. శిశువు తల్లి ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. కిడ్నాపర్ల కోసం గాలించారు.

నిందితులను పట్టుకునేందుకు నీలోఫర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు. ఇందులో కీలక ఆధారం లభించింది. ఆటోలో నుంచి నిందితులు బైక్ పైకి మారారు. మాసాబ్ ట్యాంక్ నుంచి ఎన్ హెచ్ 44 హైవే పైకి చేరుకున్న తర్వాత మారుతి ఓమ్నీ వ్యానులోకి షిఫ్ట్ అయ్యారు.

నిందితులు కర్నూలు హైవే రోడ్డు వైపు వెళ్తుండగా.. పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర వాహనాన్ని అడ్డుకున్నారు. కారులో ఉన్న మగ శిశువు, నీలోఫర్ లో కిడ్నాప్ నకు గురైన శిశువు ఒక్కటేనని ధృవీకరించుకున్న తర్వాత శిశువును నాంపల్లి పోలీసులకు అప్పగించారు. నాంపల్లి పోలీసులు శిశువును సురక్షితంగా తల్లి హసీనా ఒడికి చేర్చారు.

శిశువును కిడ్నాప్ చేసిన ముగ్గురు అనంతపురం జిల్లా ముదిగుబ్బకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ముదిగుబ్బకు చెందిన షెషన్ షా బేగం, మేకల చెరువు ప్రాంతానికి చెందిన అబ్దుల్లా, అతడి భార్య రేష్మా ఉపాధి కోసం హైదరాబాద్ వెళ్లారు. 2009లో అబ్దుల్లా, రేష్మలకు పెళ్లి అయ్యింది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. కొడుకు కోసం అబ్దుల్లా తన భార్యను వేధిస్తుండే వాడు. ఈ క్రమంలో రేష్మ మరోసారి గర్భం దాల్చింది. ప్రస్తుతం 8 నెలల గర్భవతి. ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని భావించిన బేగమ్.. మగ శిశువును తెచ్చుకోవాలని భావించారు.

ఇందుకోసం నీలోఫర్ ఆసుపత్రిని ఎంచుకున్నారు. పథకం ప్రకారం గర్భంతో ఉన్న రేష్మ చికిత్స కోసం నీలోఫర్ కు వచ్చినట్లుగా నటించారు. అబ్దుల్లా ఆసుపత్రి దగ్గర వేచి ఉండగా, షెహన్ షా బేగం.. ఆసుపత్రిలోంచి మగ శిశువుతో బయటకు వస్తున్న వృద్ధురాలిని గమనించి ఆమె దృష్టిని మరల్చింది. అనంతరం అక్కడి నుంచి ఆటోలో ముగ్గురూ పారిపోయారు. శిశువును కిడ్నాప్ చేసి ఏపీలోని అనంతపురం జిల్లాకు తరలిస్తూ ఉండగా.. జాతీయ రహదారి 44పై పట్టుకున్నారు పోలీసులు.

కిడ్నాప్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నీలోఫర్ ఆసుపత్రికి వచ్చే రోగులు గుర్తు తెలియని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. మాయమాటలు చెప్పే వారికి తమ పిల్లలను ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు

Also Read : సిగరెట్ కావాలని వచ్చాడు, కట్ చేస్తే దారుణానికి ఒడిగట్టాడు.. శ్రీకాకుళం జిల్లాలో కలకలం