Kidney Racket : హైదరాబాద్‌లో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. సరూర్నగర్ అలకనంద ఆస్పత్రి సీజ్..
సాధారణ ఆసుపత్రి పేరుతో వీరు కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది.

Kidney Racket : హైదరాబాద్ లో కిడ్నీ దందాకు పాల్పడిన ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రిలో గత 6 నెలలుగా కిడ్నీ దందాకు పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. అక్రమంగా ఆపరేషన్లు చేసి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేల్చారు. ఇటీవల ఓ మహిళకు ఆపరేషన్ చేస్తుండగా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ చేస్తున్న ఇద్దరు డాక్టర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్ నగరంలో కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన గుట్టు రట్టైంది. బయటకు సాధారణ ఆసుపత్రిలా ఉంటుంది. లోపల మాత్రం కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఎల్బీ నగర్ ఏసీపీతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని రోజులుగా అలకనంద ఆసుపత్రికి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి.
అమాయకులే టార్గెట్ గా కిడ్నీ రాకెట్..
సాధారణ ఆసుపత్రి పేరుతో వీరు కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లుగా అధికారుల తనిఖీల్లో బయటపడింది. గతంలో ఇలానే కిడ్నీ మార్పిడి చేస్తున్న సమయంలో ఓ మహిళ చనిపోయింది. అయితే గుట్టుచప్పుడు కాకుండా ఆ ఘటనను తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. సుమారుగా వందలాది మందికి ఈ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది.
Also Read : రాష్ట్రంలో వీరందరికీ రేషన్ కార్డులు ఇస్తాం.. ఆ భూములకు ఏడాదికి రూ.12 వేలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అమాయకులకు ఎర వేసి, వారి ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు తేలింది. సుమన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న పోలీసుల తనిఖీల తర్వాత ఆసుపత్రిని సీజ్ చేశారు అధికారులు.
కిడ్నీ రాకెట్ దందాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్..
కిడ్నీ రాకెట్ దందాపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ అయ్యింది. దీనిపై నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఉస్మానియా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఆసుపత్రికి వెళ్లి విచారణ చేపట్టింది. సరూర్ నగర్ లోని అలకనంద ఆసుపత్రి సాధారణ ఆసుపత్రి. ఈ హాస్పిటల్ లో 9 బెడ్స్ ఉన్నాయి. ఈ మేరకు పర్మిషన్ తీసుకున్నారు. అయితే, ఎలాంటి అనుమతులు లేకుండా 30 పడకలకు విస్తరించారు. తెరవెనుక కిడ్నీ మార్పిడికి పాల్పడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో బయటపడింది.
అలకనంద ఆసుపత్రిపై అనేక ఆరోపణలు..
గతంలోనూ ఈ ఆసుపత్రిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ చికిత్సకు వచ్చిన వారిలో కొందరు చనిపోయినట్లు తెలుస్తోంది. వరుస ఆరోపణలు రావడంతో స్థానిక వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడికి సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తున్నట్లుగా తనిఖీల్లో వెలుగుచూసింది. 6 నెలల నుంచి కిడ్నీ రాకెట్ నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో కిడ్నీకి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలిసింది.
Also Read : ఎక్కడి నుంచో బతకడానికి వచ్చినోళ్లు అంటూ.. కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు