భారీ ప్రక్షాళన: అటవీ శాఖలో 200 మంది బదిలీ

  • Published By: chvmurthy ,Published On : February 5, 2019 / 02:07 PM IST
భారీ ప్రక్షాళన: అటవీ శాఖలో 200 మంది బదిలీ

Updated On : February 5, 2019 / 2:07 PM IST

హైదరాబాద్:  సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అటవీశాఖలో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. 200 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అడవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. అడవుల సంరక్షణ విషయంలో, అటవీ భూముల్లో చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యమైన ప్రాంతాల్లో నియమించాలని సూచించారు.  చీఫ్ కన్సర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు సుమారు 200 మంది అధికారులను బదిలీ చేశారు. కలప స్మగ్లర్లపై అవసరమైతే పీడీ యాక్టు నమోదుచేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇచ్చారు. సిబ్బంది బదిలీలకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం కూడా చేశారు.

జిల్లా అటవీ అధికారులుగా పనిచేస్తున్న చీఫ్ కన్సర్వేటర్లు, కన్సర్వేటర్లు, డీఎఫ్ఓ స్థాయి కలిగిన 21 మందికి ముఖ్యమైన జిల్లాల బాధ్యతలు అప్పగించారు. స్మగ్లర్లకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో 11 మంది అధికారులను సస్పెండ్  చేశారు. పలువురికి మెమోలు జారీ చేశారు. 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చారు. ఫారెస్టర్లు, బీట్ ఆఫీసర్లలో  160 మందిని బదిలీ చేశారు. సస్పెండైన వారిలో అధికారుల స్ధాయి నుంచి గార్డుల వరకున్నారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి అధికారులు మెమోలు జారీ చేశారు.