IBomma Ravi: పైరసీ చేస్తున్న విషయమే నాకు తెలీదు.. పోలీసులకు సవాల్ విసిరితే ఊరుకుంటారా? అది చాలా పెద్ద తప్పు.. ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్స్..

హైదరాబాద్ లో ఏదో పని దొరికింది, చేసుకుంటున్నాడు, పొట్ట కూటి కోసం ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నాం.

IBomma Ravi: పైరసీ చేస్తున్న విషయమే నాకు తెలీదు.. పోలీసులకు సవాల్ విసిరితే ఊరుకుంటారా? అది చాలా పెద్ద తప్పు.. ఐ బొమ్మ రవి తండ్రి షాకింగ్ కామెంట్స్..

Updated On : November 16, 2025 / 10:18 PM IST

IBomma Ravi: ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహ‌కుడు ఇమ్మ‌డి ర‌విని హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ర‌విని సీసీఎస్ పోలీసులు పట్టేశారు. ఈ రవి మామూలోడు కాదు. మహా ముదురు. సినీ ప‌రిశ్ర‌మ‌కు భారీ న‌ష్టాన్ని క‌లిగించాడు. అంతేకాదు దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసుల‌కు, ప్రభుత్వానికి బ‌హిరంగంగా స‌వాల్ విసిరాడు. వారిని రెచ్చగొట్టాడు. దాంతో పోలీసుల ఈగో హర్ట్ అయ్యింది. ఇక, అంతే.. ఆరు నెల‌లుగా పోలీసులకు ఒకటే పని. రాత్రి పగలు అనే తేడా లేకుండా రవి కోసం తెగ గాలించారు. చివరికి పట్టేశారు.

కాగా, రవి అరెస్ట్ అంశంపై ఆయన తండ్రి చిన అప్పారావు స్పందించారు. రవి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కొడుకు రవి.. పైరసీ చేస్తున్న విషయమే తనకు తెలియదన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ”రవి నేరం చేయలేదని నేను చెప్పను, జరుగుతున్న పరిణామాలు చూసి నేరం చేసినట్లు అంగీకరించాల్సిందే. అతను ఇంటికి వచ్చి రెండేళ్లు అవుతోంది. పోలీసులకు, ప్రభుత్వానికి సవాల్ విసిరితే ఊరుకుంటారా? అది చాలా పెద్ద తప్పు. రవి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఒక పాప ఉంది. దంపతుల మధ్య గొడవలు ఉన్నాయి. వారు విడిపోయినట్లు తెలిసింది” అని చిన అప్పారావు తెలిపారు.

‘హైదరాబాద్ లో ఏదో పని దొరికింది, చేసుకుంటున్నాడు, పొట్ట కూటి కోసం ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నాం. చదువుకున్న కుర్రాళ్లు అంతా చేసుకుంటున్నారు కదా.. అలాగే నా కొడుకు రవి కూడా నెట్ వర్క్ ఏదో చేసుకుంటున్నాడు అని అనుకున్నా. ఇలా తప్పుడు పనులు చేస్తాడని అనుకోలేదు.

సినిమాలు పైరసీ చేస్తాడని నాకు అస్సలు తెలియదు. నాకు తెలిస్తే నేనొకసారి ఫోన్ చేసి గట్టిగా మందలించే వాడిని. చాలా డేంజర్, నువ్వు అలాంటి పనులు చేయకూడదని చెప్పేవాడిని. నా మాట విననీ, వినకపోనీ.. అది వేరే లెక్క. రవికి జాబ్ ఏమీ లేదు. నెట్ వర్క్ నేర్చుకున్నాడు. ఏదో పని చేసుకుని బతుకుతున్నాడు అని అనుకున్నా.

దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేయడం చాలా తప్పు. వాడి బుర్ర పని చేస్తోందని అనుకోవాలో, చేయడం లేదని అనుకోవాలో. ప్రభుత్వానికి సవాల్ చేయడం ఏంటి? చేసిందే వెధవ పని. ప్రభుత్వాన్నే సవాల్ చేస్తాడా? ప్రభుత్వం ఏమైనా అమాయకులా? వాళ్ల నెట్ వర్క్ చాలా పెద్దది. తేలిగ్గా అంచనా వేయడం తప్పు. చేసింది తప్పు. ఊరుకోవాలి. అది ఎవరు చేసినా తప్పే.

రవి విదేశాల్లో ఉన్నాడనే విషయం కూడా నాకు తెలియదు. నేను పస్తులు పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. వాడు సంపాదించింది నాకు పెట్టక్కర్లేదు. దేవుడు నాకు ఇచ్చింది చాలు. పొట్ట గడిస్తే చాలు. నా ఇంట్లో నేను ఒక్కడినే ఉంటున్నా. నాకు కొడుకు, కూతురు. రవి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. వారి మధ్య విబేధాలు వచ్చాయి. భార్యతో విడిపోయాను అని రవి చెప్పాడు’ అని రవి తండ్రి అప్పారావు తెలిపారు.