అక్రమ సంబంధాల కేసుల్లో గుంటూరు పోలీసులు టాప్

న్యాయం చేయమని పోలీసు స్టేషన్ కు వచ్చిన మహిళలను ట్రాప్ చేసి వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ నడుపుతూ చివరికి ఉద్యోగం నుంచి సస్పెండవుతున్న వారిలో గుంటూరు జిల్లా పోలీసులు ముందుంటున్నారు. తాజాగా ఒక మహిళతో అక్రమ సంబంధం నడిపి ఆమెను మోసం చేసిన కేసులో నగరపాలెం సీఐ వెంకటరెడ్డిపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. జిల్లాలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటంతో పోలీసు శాఖపై విమర్శలు ఎక్కువయ్యాయి.
మోడల్ పోలీసు స్టేషన్ గా మార్చిన నగరపాలెం పోలీసు స్టేషన్ లో వెంకట రెడ్డి సీఐ గా విధులునిర్వహిస్తున్నారు. అక్కడకు ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళను ట్రాప్ చేసి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. కొన్నాళ్లు ఆమెను అన్ని రకాలుగా వాడుకుని చివరికి వదిలేశాడు.
సీఐ చేతిలో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ జిల్లా అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గుంటూరు రేంజి ఐజీ ఆదేశాల మేరకు ఈ అంశంపై ఎస్పీ విచారణ చేపట్టారు. విచారణలో సీఐపై మహిళ చేసిన ఆరోపణలు నిజమని తేలింది. దీంతో వెంకటరెడ్డిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. గుంటూరు జిల్లాలో కొంతకాలం నుంచి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
గుంటూరు జిల్లా అరండల్‌పేట ఎస్ఐ బాలకృష్ణ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో ఎస్ఐ బాలకృష్ణతో పాటు ఆయనకు సహకరించిన మరోఇద్దరు కానిస్టేబుళ్ళను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా మరో ఎస్ఐ కూరపాటి నాగేంద్ర కూడా తనను లైంగికంగా వేధించారని ఒక యువతి ఫిర్యాదు చేసింది.
ఫేస్‌బుక్ ద్వారా తనకు పరిచయమైన ఎస్ఐ లైంగికంగా వేధింపులకు పాల్పడినట్టుగా బాధితురాలు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఇంకా విచారణ జరుగుతోంది. ఇప్పుడు సీఐ వెంకట రెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలటంతో ఉన్నతాధికారులు సీఐను సస్పెండ్ చేశారు.
పౌరుల్ని, చట్టాల్ని కాపాడాల్సిన పోలీసు డిపార్ట్ మెంట్ లో లైంగిక వేధింపులను సీరియస్ గా తీసుకుంటామని కొంతకాలం క్రితం పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.దీంతో బాధితులు ఒక్కరొక్కరేబయటకు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. లైంగిక ఆరోపణల కేసుల్లో ఎస్సైలు,సీఐలు, కానిస్టేబుళ్లు సస్బెండవుతూ ఉండటంతో డిపార్ట్ మెంట్ పరువు పోతోందని అధికారులు వాపోతున్నారు.