వృత్తి సాఫ్ట్ వేర్ ఇంజనీర్..ప్రవృత్తి సోషల్ మీడియాలో అమ్మాయిలకు వల

చదివింది బీటెక్, చేసింది దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం…టెక్నాలజీ వాడటంలో దిట్ట…ఉద్యోగం చేసినన్నాళ్లు కుదురుగా చేసుకున్నాడు. స్వగ్రామం వచ్చాడు. ఏమైందో ఏమో బుద్ధి వక్రమార్గంలోకి మళ్ళింది. టెక్నాలజీ ఉపయోగించి మహిళలను, యువతులను బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. ఇక అక్కడి నుంచి నేరపూరిత ఆలోచనలతో మోసాలు చేయటం మొదలెట్టాడు. ఎందరో మహిళల జీవితాలతో ఆడుకున్న కీచకుడు కటకటాల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.
షాపింగ్ మాల్ లో పరిచయమైన యువతిని కూడా అలాగే చెరబట్టబోతే తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. దీంతో బాధితుడి కామలీలలు ఒక్కోక్కటిగా వెలుగు చూశాయి. ఆ నీచుడి బారిన పడిన మహిళల వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. మహిళ అకృత్యాలపై విచారణ చేస్తన్న పోలీసులకు ఇతడికి గంజాయి ముఠాతో కూడా సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగు చూసే సరికి పోలీసులు షాకయ్యారు. పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చీర్వానుప్పలపాడుకు చెందిన కొల్లూరు చైతన్య బీటెక్ పూర్తి చేసి దుబాయ్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశాడు. అక్కడ కొన్నాళ్లు పనిచేసి స్వగ్రామం తిరిగి వచ్చాడు. వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉండటంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా యువతులను, వివాహితులను ట్రాప్ చేయటం మొదలెట్టాడు. అలా పరిచయం అయిన మహిళలను కోరిక తీర్చాలని వేధించడం , కాదన్నవారిని బ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు.
ఒంగోలులోని ఒక షాపింగ్ మాల్ లో కొద్ది రోజుల క్రితం ఓ యువతి పర్సు పోగొట్టుకుంది. ఆసమయంలో అక్కడ ఉన్న చైతన్య ఆమె పర్సు వెతికి ఆమెకు అందచేశాడు. ఆ పరిచయంతో ఆమె ఫోన్ నెంబరు తీసుకుని ఆమెతో ఛాటింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఆక్రమంలో ఆమెను శారీరకంగా లొంగదీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించాడు. ఆమెను బెదిరింపులకు గురిచేశాడు. అతని బెదిరింపులకు భయపడిన ఆమె నాగులుప్పలపాడు రాగా అక్కడినుంచి ఆమెను కారులో కిడ్నాప్ చేసేందుకు యత్నించాడు. భయంతో ఆ యువతి కేకలు వేసుకుంటూ పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు చైతన్యను అరెస్టు చేశారు.
చైతన్యను అరెస్టు చేసినప్పుడు అతడి కారులో పోలీసులకు గంజాయి పాకెట్లు దొరికాయి. విశాఖ నుంచి గంజాయి తీసుకువచ్చి పాకెట్లు కట్టి విక్రయిస్తున్నట్లు చైతన్య వెల్లడించాడు. చైతన్యపై మరింత లోతుగా విచారణ చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నాగులుప్పలపాడుకు చెందిన క్లాస్ మేట్ ను కూడా ఇలానే లొంగదీసుకునేందుకు యత్నించాడు. వివాహం చేసుకుని వేరే రాష్ట్రంలో ఉంటున్న ఆమెను కోరిక తీర్చాలంటూ వేధించాడు. అంగీకరించకపోవటంతో ఆమెతో మాట్లాడిన ఫోన్ కాల్స్, ఏకాంతంగా ఉన్నప్పటి ఫోటోలు బయటపెడతానని బెదిరించాడు. దీంతో ఆమె కూడా పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అరెస్టు చేసిన పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.
జైలులో చైతన్యకు తమిళనాడుకు చెందిన కార్ల దొంగ సెల్వంతో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సెల్వ కోసం తమిళనాడు వెళ్లాడు చైతన్య. అక్కడ సెల్వ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఒంగోలులోనూ ఒకవివాహితతో ఫేస్‌బుక్, ఇన్‌స్ర్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకొని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసినట్లు చైతన్యమీద ఆరోపణలున్నాయి. గుంటూరులో మెడిసిన్ చదువుతున్న ఓ విద్యార్థినిని ఇదేవిధంగా మోసం చేయడంతో ఆమె తల్లిదండ్రులు దేహశుద్ధి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
టెక్నాలజీ ఉపయోగించి విదేశాలనుంచి మాట్లాడుతున్నానని…వారికోసమే ఇండియా వచ్చానని చెప్పి వలలో వేసుకుని వేధింపులకు దిగేవాడని తెలిసింది. ఇన్ని విధాలుగా నేరస్వభావం కలిగిన చైతన్యపై రౌడీ షీట్ తెరిచామని అతడి బాధితులు ఎవరైనా ముందుకొచ్చి ఫిర్యాదుచేస్తే వారివివరావలుగోప్యంగా ఉంచి అతడిపై చర్యలు తీసుకుంటామని ఒంగోరు పోలీసులు తెలిపారు.
See Also | జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరగానే ఫోర్జరీ కేసు రీ ఓపెన్