Pet Dog Killed: బాబోయ్.. పెంపుడు కుక్కను చంపి.. మృతదేహాన్ని ఇంట్లోనే దాచిన మహిళ.. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు
త్రిపర్ణ ఫ్లాట్ మొత్తం దేవుళ్ల ఫొటోలు, పూజా వస్తువులతో నిండి ఉంది. అక్కడ తాంత్రిక లేదా క్షుద్ర పూజలు చేసి ఉన్న ఆనవాళ్లు గమనించారు.

Pet Dog Killed: ఆధునిక యుగంలోనూ ఇంకా మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. కొందరు వ్యక్తులు అంధ విశ్వాసాల్లో కూరుకుపోతున్నారు. క్షుద్రపూజలు, తాంత్రిక పూజలు, బలి అంటూ దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన పెంపుడు కుక్కను ఆమె బలి ఇచ్చింది. ఆ తర్వాత మృతదేహాన్ని తన ప్లాట్ లోనే దాచింది. అపార్ట్ మెంట్ కు తాళం వేసుకుని వెళ్లిపోయింది. ప్లాట్ నుంచి దారుణంగా దుర్వాసన రావడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ పేరు త్రిపర్నా పైక్. పశ్చిమ బెంగాల్ కు చెందిన త్రిపర్ణా బెంగళూరులోని మహదేవపురలో నివాసం ఉంటోంది. త్రిపర్ణా లాబ్రడార్ జాతికి చెందిన మూడు కుక్కలను పెంచుకుంటోంది. ఏం జరిగిందో కానీ ఆమె దారుణానికి ఒడిగట్టింది. తన పెంపుడు కుక్కలలో ఒకదాని గొంతు నొక్కి చంపింది. తర్వాత కత్తితో గొంతు కోసింది. అనంతరం శవాన్ని ప్లాట్ లోనే ఉంచింది. అపార్ట్ మెంట్ కు తాళం వేసుకుని వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు పోలీసులకు, మున్సిపల్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
మున్సిపల్ సిబ్బంది, పోలీసులు అక్కడికి వచ్చారు. ప్లాట్ డోర్ బద్దలు కొట్టి లోపలి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి షాక్ అయ్యారు. గుడ్డలో చుట్టి మెడ కోసి ఉన్న కుళ్లిన కుక్క మృతదేహం వారికి కనిపించింది. బతికున్న మరో రెండు శునకాలు కూడా కనిపించాయి. త్రిపర్ణ ఫ్లాట్ మొత్తం దేవుళ్ల ఫొటోలు, పూజా వస్తువులతో నిండి ఉంది. అక్కడ తాంత్రిక లేదా క్షుద్ర పూజలు చేసి ఉన్న ఆనవాళ్లు గమనించారు. గొలుసులతో కట్టేసిన రెండు కుక్కలను పశు వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: నరకం చూశారు.. 32 గంటలు ట్రాఫిక్ జామ్.. చిక్కుకుపోయిన 4వేల వాహనాలు.. ముగ్గురు మృతి..
ఆ పెంపుడు కుక్క నాలుగు రోజుల క్రితం చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. త్రిపర్ణపై జంతు హింస, సంబంధిత సెక్షన్ల కింద మహదేవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ మహిళ క్షుద్ర పూజలకు పాల్పడిందా? లేక ఆమె మానసిక పరిస్థితి బాగోలేదా? అన్నదానిపై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.