హావాలా గుట్టు రట్టు : ప్రత్యేక జాకెట్ లో తరలిస్తున్న రూ.70 లక్షలు స్వాధీనం

  • Published By: chvmurthy ,Published On : March 17, 2019 / 03:43 AM IST
హావాలా గుట్టు రట్టు : ప్రత్యేక జాకెట్ లో తరలిస్తున్న రూ.70 లక్షలు స్వాధీనం

హైదరాబాద్:  హైదరాబాద్ కేంద్రంగా చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ నుంచి  సాగుతున్న హవాలా సొమ్ము రవాణా వ్యవహారం శనివారం వెలుగు చూసింది. ఎన్నికల వేళ పోలీసులు జరుపుతున్న తనిఖీల్లో ఇది బయటపడింది. ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జాకెట్ లో రవాణా చేస్తున్న 70 లక్షల రూపాయల నగదును పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పిన వివరాల ప్రకారం….మహారాష్ట్రకు చెందిన చంద్రకాంత వర్మ అనే వ్యక్తి  ఉద్యోగం కోసం  హైదరాబాద్ వచ్చి బేగం బజారు లో నివసిస్తూ….. జూబ్లీ హిల్స్, రోడ్ నెంబరు 36 లోని ఒక డైమండ్ స్టోర్ & జ్యూయలరీ షాపులో పనిచేస్తుంటాడు. జ్యూయలరీషాపు యజమాని సూచనల మేరకు పలువురి వద్ద నుంచి నగదు వసూలు చేస్తుంటాడు. 

తన యజమాని సూచనల మేరకు చంద్రకాంత్ మార్చి 14న చత్తీస్ ఘడ్ రాజధాని రాయ్పూర్ కు వెళ్లాడు. అక్కడ నుంచి బుధాపూర్ వెళ్లి, అక్కడ శంకర్ అనే వ్యక్తిని కలిశాడు. అతని ద్వారా సునీల్ సోనీ అనే మరో వ్యక్తిని కలిస్తే… సోనీ 70 లక్షల రూపాయల నగదును అందచేశాడు. ఆ డబ్బును ప్రత్యేకంగా తయారు చేయించుకున్న జాకెట్ లో భద్ర పరుచుకుని శనివారం తిరిగి బస్సులో హైదరాబాద్ చేరుకుని ఆటోలో వెళుతున్నాడు. 

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా నేరేడ్ మెట్ లోని ఆర్.కే.పురం చౌరస్తా వద్ద ఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అదే మార్గంలో ఆటోలో ప్రయాణిస్తున్న చంద్రకాంత్ కదలికలపై అనుమానం రావటంతో పోలీసులు అతడ్ని తనిఖీ చేశారు. దీనితో అతని వద్ద ఉన్న 70 లక్షల రూపాయల నగదు బయటపడింది. ఈనగదుకు ఎలాంటి పత్రాలు లేకపోవటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా… పలు విషయాలు చెప్పాడు. మార్చి 7వ తేదీన కూడా రాయ్ పూర్ నుంచి ఇదే తరహాలో 33 లక్షల రూపాయలను తీసుకు వచ్చి జ్యూయలరీ షాపు యజమాని చంద్ర ప్రకాష్ కు అప్ప చెప్పినట్లు తెలిపాడు. పోలీసులు చంద్రప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా…… జ్యూయలరీ షాపు యజమానికి రాయపూర్ లోని సునీల్ సోనితో సంబంధాలున్నాయని, పలుమార్లు  హావాలా సొమ్మును పంపించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు సీపీ చెప్పారు.