పిల్లల ప్రాణాలు పోతే బెయిలబుల్ కేసులు పెడతారా : పోలీసులపై కోర్టు ఆగ్రహం

హైదరాబాద్ లోని ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఘటనలో పోలీసుల తీరుపై రంగారెడ్డి జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులపై.. పోలీసులు 304 ఏ సెక్షన్ కింద బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగి.. చిన్నారి ప్రాణాలు కోల్పోతే.. బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని.. పోలీసులను కోర్టు ప్రశ్నించింది. 304ఏ సెక్షన్‌ను.. 304.. టుగా మార్చి నిందితులకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురుని.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
శుక్రవారం (అక్టోబర్ 25, 2019) షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. షైన్ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో బాలుడు మృతికి కారణమైన సునీల్ కుమార్ రెడ్డి పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కుమార్ అరెస్టును గోప్యంగా ఉంచిన ఎల్బీ నగర్ పోలీసులు.. మీడియాకు చూపించకుండా కోర్టులో హాజరుపర్చారు.
సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే శనివారం (అక్టోబర్ 26, 2019) మరో నలుగురికి కోర్టు రిమాండ్ విధించింది. దీంతో సునీల్ కుమార్ రెడ్డితో పాటు మరో నలుగురిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.