Road Accident : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదలో మృతుల్లో హైదరాబాద్ కు చెందిన ముగ్గురు, తమిళనాడు చెందిన ఓ వ్యక్తి ఉన్నారు.
Road Accident In US : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెం.75లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. ముగ్గురు హైదరాబాద్ కు చెందినవారు. ఒకరు చెన్నైకి చెందిన వారిగా గుర్తించారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read : North Korea : ఉత్తర కొరియాలో 30మంది ప్రభుత్వ అధికారులకు ఉరిశిక్ష.. ఎందుకంటే?
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారిలో హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి(27), ఫరూక్ షేక్ (30), లోకేష్ పాలచర్ల (28) ఉండగా.. మరో వ్యక్తి తమిళనాడుకు చెందిన దర్శిని వాసిదేవన్ (25)గా గుర్తించారు. వీరంతా కలిసి బెన్‌టోన్‌విల్లె ప్రాంతానికి వెళ్లేందుకు కార్ పూలింగ్ యాప్ ద్వారా కలిశారు. డల్లాస్ లో బంధువులను కలిసి ఇంటికి వెళ్తున్న ఆర్యన్ రఘునాథ్, భార్యను కలిసేందుకు లోకేశ్, యూనివర్శిటీకి వెళ్తున్న దర్శిని వాసుదేవన్, ఫరూఖ్ ఒకే కారులో వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెనకనుంచి వచ్చిన ఐదు కార్లు ఒకదానికొకటి అతివేగంగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
వీరు ప్రయాణిస్తున్న వాహనానికి మంటలు అంటుకోవడంతో బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది. వీరి మృతదేహాలు గుర్తుపట్టని విధంగా మంటల్లో కాలిపోయాయి. దీంతో కార్ పూలింగ్ యాప్ లో నమోదైన వివరాల ప్రకారం మృతుల పేరు, వివరాలను అక్కడి అధికారులు గుర్తించారు.