మణుగూరు ఎక్స్‌ప్రెస్ రైల్లో దొంగలు పడ్డారు

రైలులో దొంగలు బరి తెగించారు. ఛైన్ లాగి మరి బంగారు ఆభరణాలను దర్జాగా అపహరించుకపోయారు. దీంతో మహిళలు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. మణుగూర్ ఎక్స్ ప్రెస్ ట్రైన్‌లో వేర్వేరుగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 70 గ్రాముల బంగారు గొలుసులు స్నాచింగ్‌కు గురయ్యాయని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు.
కొత్తగూడెం ప్ర్రాంతానికి చెందిన కొల్లు లక్ష్మీ భర్త వెంకట్ రెడ్డితో కలిసి కూకట్ పల్లికి వచ్చేందుకు మణుగూరు ఎక్స్ ప్రెస్ రైలు కొత్తగూడెంలో ఎక్కారు. ఉదయం 3.30గంటలకు రాయగిరి – ఆలేరు రైల్వేస్టేషన్ మధ్య వంగపల్లి ప్రాంతంలో ఓ వ్యక్తి ఛైన్ లాగాడు. రైలు ఆగడం…కొల్లు లక్ష్మీ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు మంగళసూత్రం, ఎస్ -2 బోగీలో ఉన్న శీలం సరళ మెడలోని మూడు తులాల బంగారం గొలుసును కిటికీలో నుండి లాగేశారు. అరుపులు..కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు.
మరో ఘటనలో..
కూకట్ పల్లిలో నివాసం ఉండే తనూజ..తన కుమార్తెతో కలిసి కొల్హాపూర్ – మణుగూరు రైల్లో బళ్లారి నుండి సికింద్రాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి 2గంటల సమయంలో నల్వర్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఆగింది. అప్పటి వరకు ఎస్ 2 బోగీలో ప్రయాణీకుడిగా నటిస్తున్న వ్యక్తి తనూజ మెడలోని నల్లపూసల గొలుసును లాక్కొని ఉడాయించాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.