ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, హనీమూన్ కూడా అయిపోయింది.. ఇప్పుడు, ఇంట్లో వద్దన్నారని వదిలేశాడు

ప్రేమించాను అని వెంటపడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. హనీమూన్ కూడా అయిపోయింది. ఐదేళ్ల పాటు యువతితో సంబంధం నెరిపాడు. మోజు తీరిందో మరేమో కానీ, సడెన్ గా అమ్మాయిని వదిలేశాడు. తాను మోసపోయానని తెలిసి బాధితురాలు కన్నీరుమున్నీరైంది. న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
ప్రేమ పేరుతో యువతిని ట్రాప్:
వివరాల్లోకి వెళితే, ప్రేమ పేరుతో ఓ యువతిని పెళ్లి చేసుకుని ఆపై మోసం చేసిన పవన్ అనే వ్యక్తిని సరూర్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చంపాపేట్ నాగార్జున కాలనీకి చెందిన శ్రీపురం పవన్(33) కర్మన్‌ఘాట్‌కు చెందిన సమీప బంధువైన ఓ యువతిని ప్రేమ పేరుతో ట్రాప్ చేశాడు. పెళ్లి పేరుతో 2015 నుంచి ఆమెతో సన్నిహితంగా ఉన్నాడు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన పవన్.. 2017లో బెంగళూరుకు యువతిని తీసుకెళ్లి ఆమె మెడలో పసుపు కొమ్ము కట్టి పెళ్లి చేసుకున్నాడు.
ఊటీలో హనీమూన్:
అప్పట్లో హనీమూన్ పేరుతో మూడు రోజుల పాటు ఊటీకి తీసుకెళ్లాడు. ఇంట్లో వాళ్లను ఒప్పించి అధికారికంగా పెళ్లి చేసుకుందామనే నెపంతో నగరానికి వచ్చి యధావిధిగా జీవనం సాగిస్తున్నారు. అయితే సడెన్ గా పవన్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మాయికి ఊహించని షాక్ ఇచ్చాడు. తమ ఇంట్లో వాళ్లు ఒప్పుకోవడం లేదని, పెళ్లి చెల్లదని.. నాకూ నీకూ ఏ సంబంధం లేదని తెగేసి చెప్పాడు. దీంతో యువతి కంగుతింది. తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలు సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పవన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
2017లో తామిద్దరం పెళ్లి చేసుకున్నామని బాధితురాలు చెప్పింది. హనీమూన్ కోసం ఊటీకి తీసుకెళ్లాడంది. అక్కడి నుంచి వచ్చాక పవన్ లో మార్పు వచ్చిందని చెప్పింది. ఇంట్లో వాళ్లు మన పెళ్లిని ఒప్పుకోవడం లేదని చెప్పి పవన్ తనను వదిలేశాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరింది.