బంగ్లాదేశ్ లో విషాదం : గ్యాస్ పైప్ లైన్ లీకై ఏడుగురి మృతి

బంగ్లాదేశ్ లోని చిట్టగ్యాంగ్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదంతస్తుల భవనం వద్ద గ్యాస్ పైప్ లైన్ లీకై జరిగిన పేలుడులో 7గురు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం, నవంబర్ 17న జరిగిన ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు.
ఐదంతస్తులభవనం ముందు ఉన్న గ్యాస్ పైప్ లైన్ లీకై పేలుడు సంభవించింది. పేలుడుకు అక్కడఉన్న ప్రహరీ గోడ కూలిపోవటంతో ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాదం జరిగిన రోడ్డు రద్దీగా ఉండి ట్రై సైకిల్ రిక్షాలతో బిజీగా ఉందని తెలిసింది. పేలుడుకు గోడ కూలి రోడ్డుపై వెళ్లే పాదచారులు పై పడింది. పేలుడుకు గల కారణాలు విశ్లేషిస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్ధలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. అక్టోబరు నెలలో ఢాకాలో జరిగిన గ్యాస్ ప్రమాదంలోనూ 7 గురు చిన్నారుల మృతి చెందిన విషయం మరువక ముందే ఈ ఘటన జరిగింది.