భారీ లాభాల పేరుతో ఘరానా మోసం.. రూ.6 కోట్లతో పరార్..
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయగా.. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

Share Market Scam (Photo Credit : Google)
Share Market Scam : తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు అంటూ ఊరించాడు. స్టాక్ మార్కెట్ పేరుతో మాయ చేశాడు. చివరికి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రూ.6 కోట్లతో పరార్ అయ్యాడు. పుణెలో ఘరానా మోసం వెలుగుచూసింది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులపై అధిక రాబడుల వాగ్దానాలతో ఎర చూపి 43 మందిని చీట్ చేశాడు. రూ.5.96 కోట్లతో ఉడాయించాడో కేటుగాడు.
హడప్సర్‌లోని వైదువాడి ప్రాంతానికి చెందిన 57 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రతీక్ కుమార్ అనే వ్యక్తి అధిక రాబడి పేరుతో తమను మోసం చేశాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. నిందితుడు ప్రతీక్ కుమార్ వాల్యూ ట్రెక్ షేర్ మార్కెట్, ట్రేడ్ ఆర్ట్ షేర్ మార్కెట్ పేర్లతో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. షేర్ మార్కెట్ లో ట్రైనింగ్ ఇస్తానని, ప్రాథమిక సూత్రాలు నేర్పిస్తానని అతడు యాడ్ ఇచ్చాడు. ఇన్వెస్ట్ చేయడం ఎలా అనే దానిపై ట్రైనింగ్ ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత షేర్ మార్కెట్ లో ఎలా పెట్టుబడి పెట్టాలో తాను నేర్పిస్తానన్నాడు. అంతేకాదు.. షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టిన పెట్టుబడిపై ప్రతి నెల 10శాతం రాబడి వచ్చేలా చూసే హామీ తనదేనన్నాడు.
ప్రతీక్ మాటలు నమ్మిన కొందరు.. అతడి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అతడు చెప్పినట్లు ఇన్వెస్ట్ మెంట్ కూడా చేశారు. ప్రతీక్ మాటలు నమ్మి తాను రూ.25లక్షలు ఇన్వెస్ట్ చేశానని బాధితురాలు తెలిపింది. ప్రారంభంలో నిందితుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడని, 10శాతం రిటర్న్‌లో భాగంగా తన ఖాతాకు 3 లక్షలు బదిలీ చేశాడంది. దీంతో అతడిపై నమ్మకం కుదిరిందని పేర్కొంది. అయితే, ఆగస్ట్ 2024 నుండి సడన్ గా రిటర్న్‌లు రావడం ఆగిపోయాయంది. అంతేకాదు ప్రతీక్ తన ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసుకున్నాడంది. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు లబోదిబోమంది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది.
Also Read : అర్థరాత్రి ప్రయాణాలు చేస్తున్నారా? బీకేర్ ఫుల్.. వెన్నులో వణుకు పుట్టించే వీడియో…
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేయగా.. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ప్రతీక్ ఏకంగా 43 మందిని మోసం చేసినట్లు తేలింది. మొత్తం రూ.6 కోట్లు వసూలు చేసి అతడు పారిపోయాడని పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా, భారీ లాభాలు, అధిక లాభాలు అంటూ చెప్పే మాయమాటలు నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.