మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ముగ్గురు మహిళలతో సహా ఆరుగురి మృతి

six killed in road accident near marrimitta village : మహబూబాబాద్ జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరణించిన వారంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం జరిగింది.
గూడురు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఓ కుటుంబం పెళ్లి బట్లలు కొనటానికి ఆటోలో నర్సంపేటకు బయలుదేరారు. ఆటో గూడురు మండలం మర్రిమిట్ట వచ్చే సరికి వేగంగా వచ్చిన లారీ ఆటోను ఢీ కొట్టటంతో, ఆటోనుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్నవారంతా అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారిలో పెళ్లి కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి లారీ కింద ఇరుకున్న ఆటోను ప్రోక్లెయినర్ సహాయంతో బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగంతో లారీ ప్రయాణించటమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా ప్రాంతం హృదయ విదారకంగా ఉంది.
ఒకే కుటుంబానికి చెందిన వారు ఆరుగురు మరణించారని తెలియటంతో ఎర్రకుంట్ల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈప్రమాద వార్త తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు.