Hyderabad : ప్రేమించి పెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్య ?
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని చంపిన నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Hyderabad Swe Brutally Murder
Hyderabad : హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న సాప్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. అతడ్ని చంపిన నిందితులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. సగం కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కేపీహెచ్ బీ కాలనీ పేజ్ 1 లో నివసించే నారాయణ రెడ్డి ఏడాది క్రితం ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్ళి యువతి తల్లితండ్రులకు ఇష్టంలేదు. దీంతో వారు ఆమెను ఇంటికి తీసుకువెళ్లి నారాయణ రెడ్డిని బెదిరించి యువతిని హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఆయువతి నారాయణ రెడ్డి ఇద్దరూ తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఈసంగతి అమ్మాయి వాళ్ల ఇంట్లో వాళ్ళకు తెలిసింది. దీంతో వారు నారాయణ రెడ్డిని హతమార్చాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా నారాయణ రెడ్డి కనిపించక పోవటంతో మిత్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూన్ 29 న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నారాయణ రెడ్డి కాల్ డేటా ఆధారంగా శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు విచారణలో కీలక విషయాలు రాబట్టారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నారాయణ రెడ్డి మృతదేహాన్ని ఆదివారం ఉదయం కనుగొన్నారు.
మృతుడు నారాయణరెడ్డికి గతంలోనే శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఉంది. ఈ క్రమంలో జూన్ 29 న వాళ్లిద్దరితో పాటు మరికొంతమంది ఖాజాగూడ వద్ద వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి తాగారు. అనంతరం నారాయణ రెడ్డిని గొంతు నులిమి హత్యచేసి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగల బెట్టారు. ఈ ఉదయం మృతేదేహాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. యువతి కుటుంబ సభ్యులే ఈహత్య చేయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు విచారణ అనంతరం పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
Also Read : WhatsApp: వాట్సప్ ఆన్‌లైన్‌లో ఉండికూడా హైడ్ చేసుకోవచ్చు