రహస్య ప్రాంతంలో ముంబై నటి, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ.. ఏం జరగనుంది?

ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు.

రహస్య ప్రాంతంలో ముంబై నటి, పోలీసు వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ.. ఏం జరగనుంది?

Mumbai Actress Case : ముంబై నటి విజయవాడ సీపీ ముందుకు రానున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఆమె సీపీకి ఫిర్యాదు చేయనున్నారు. ముంబై నుంచి వచ్చిన నటిని.. విజయవాడలోని ఓ రహస్య ప్రాంతంలో ఉంచారు పోలీసులు. తనను వేధించిన పోలీసు అధికారులపై ఆమె ఎలాంటి ఫిర్యాదు చేయనున్నారు అనే దానిపై పోలీసు వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వ పెద్దలు, పోలీసు అధికారులపై నటి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. గత సర్కార్ లో పని చేసిన పెద్దల ఒత్తిడితోనే తనను చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు. ముంబై నుంచి తీసుకొచ్చి మరీ చిత్రహింసలు పెట్టారని వాపోయారు.

దీంతో ఐపీఎస్ అధికారులు కాంతి రానా, విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కేసు ఫైల్ ను పరిశీలించిన కమిషనర్ రాజశేఖర్ బాబు.. డీజీపీకి నివేదిక పంపించారు. ఈ కేసులో అసలు విషయం తేల్చేందుకు ఇప్పటికే స్రవంతి రాయ్ అనే అధికారిని నియమించారు. నాలుగు రోజుల్లో ఆమె నివేదిక ఇవ్వనున్నారు. నటిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులోని లోతును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాఫ్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్ట్ చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ కేసులో అప్పట్లో పోలీసులు ఏడుగురు సాక్షులను చేర్చారు. వారిని పిలిపించి విచారణ అధికారి వివరాలు రాబట్టనున్నారు.

ప్రస్తుతం ఓ హోటల్ లో సినీ నటి ఉన్నారు. ముందుగా సీసీఎస్ పోలీస్ స్టేషన్ కు వచ్చి స్టేట్ మెంట్ ఇవ్వాలని అనుకున్నా.. అనూహ్య పరిణామాల నేపథ్యంలో.. ఆమె ఉన్న హోటల్ కే వెళ్లి పోలీసులు విచారణ చేస్తున్నారు. అసలేం జరిగింది? ఫ్రిబవరి 2,3 తేదీల్లో ఏపీకి ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు? నమోదైన కేసులు ఏంటి? కొన్ని రోజుల పాటు ఆ గెస్ట్ హౌస్ లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? రిమాండ్ లో ఉన్నప్పుడు ఎవరు కలిశారు? ఎందుకు కలిశారు? ఏం చేశారు? మొత్తం కూడా సీసీ ఫుటేజ్ ని పోలీసులు కలెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ముంబై ఏయే అధికారులు వెళ్లారు? ఎవరి ఆదేశాలతో ముంబై వెళ్లారు? కేసు నమోదు చేసి నటిని ఏపీకి తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ తెలుసుకోనున్నారు పోలీసులు. ఇల్లీగల్ గా ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో నటిని ఉంచి విచారణ చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతి రానా టాటా, డీసీపీ విశాల్ గున్నిపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే ఈ విధంగా ఇల్లీగల్ గా కేసు పెట్టి ఒక ప్రైవేట్ పంచాయితీలో ఏ విధంగా పాల్గొంటారు అనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

 

Also Read : వైసీపీ ఎంపీల రాజీనామా వెనుక జగన్ మాస్టర్ ప్లాన్? అప్పుడు చంద్రబాబు అనుసరించిన వ్యూహాన్నే ఇప్పుడు జగన్ అమలు చేస్తున్నారా?