టార్చర్ భరించలేక భర్తను చంపిన భార్య

భర్త పెట్టే చిత్రహింసలు భరించలేని భార్య, కొడుకులతో కలిసి తాళి కట్టిన భర్తను మట్టు బెట్టింది. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం, కేంద్రం దుబ్బ ప్రాంతంలో గంధం రమేష్(41) పద్మ దంపతులు తమ ఇద్దరు కుమారులతో నివసించేవారు.
మేస్త్రీ పని చేసే రమేష్ ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి భార్య పద్మను కొడుతూ చిత్ర హింసలకు గురిచేసేవాడు. దీంతో ప్రతిరోజు ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి.మే30,శనివారం రాత్రి కూడా రమేష్ తాగి వచ్చి పద్మను చితక బాదాడు. భార్య భర్తలు గొడవ పడిన అనంతరం రమేష్ ఆరుబయటకువెళ్లి పడుకున్నాడు.
ఈ నేపధ్యంలో భర్త పెట్టే హింస భరించలేని పద్మ, ఆదివారం తెల్లవారుఝూమున ఇద్దరు కుమారులతో కలిసి భర్త మెడకు వైరు బిగించి, హత్య చేసింది. అనంతరం ఇద్దరు కొడుకులతో కలిసి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. ఆర్మూర్ ఆర్మూర్ రూరల్ సీఐ విజయ్‌కుమార్, ఎస్సై రాఘవేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని రమేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేపట్టారు.