రూ.6.5లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వేములవాడ ఆలయ అధికారి

వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీటీడీఏ) ప్రధాన ప్లానింగ్ అధికారి (సీపీవో) లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. లేఅవుట్ అనుమతి కోసం రూ. 6.5 లక్షలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారుల వలలో చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ (శ్రీ సాయినంది డెవలపర్స్) వ్యాపారి జివ్వాజి సంపత్.. రుద్రవరంలో 8 ఎకరాల స్థలంలో లేఅవుట్ వేశారు. అనుమతులు పొందడం కోసం వీటీడీఏకు దరఖాస్తు చేసుకున్నారు.
(వీటీడీఏ) ప్రధాన ప్లానింగ్ అధికారి లక్ష్మణ్ గౌడ్.. అనుమతి కావాలంటే రూ.20 లక్షలు లంచం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. మధ్యవర్తుల సాయంతో రూ. 6.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. కానీ, అంతడబ్బు లంచంగా ఇచ్చేందుకు సంపత్‌కు నచ్చలేదు. విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. డబ్బు ఇచ్చేందుకు లక్ష్మణ్‌గౌడ్ సోమవారం హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లో ఇంటికి రమ్మన్నాడు. ఆ సమయంలో లక్ష్మణ్‌గౌడ్ కుమారుడు రోహిత్.. డబ్బును తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
కొడుకు రోహిత్ ఇచ్చిన సమాచారంతో బేగంపేట్‌లోని పర్యాటకభవన్‌లో సీపీవో లక్ష్మణ్‌గౌడ్‌ను అరెస్టు చేశారు. ఇరువురిపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ కరీంనగర్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు.