చచ్చిపో… అంటూ భర్త ప్రేరేపించటంతోనే చిత్ర ఆత్మహత్య

VJ chitra suicide case, chennai police arrest her husband : తమిళ బుల్లి తెరనటి వీజే చిత్ర ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిత్ర మరణానకి ఆమె భర్తే కారణమని తేల్చారు. ఆమెపై అనుమానం పెంచుకున్న హేమంత్ కుమార్ ….చచ్చిపో అంటూ చిత్రను ప్రేరేపించినట్లు విచారణలో వెలుగు చూసింది. భర్తే ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తేలటంతో హేమంత్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పాండియన్ స్టోర్స్ ముల్లై పాత్రధారిణి నటి చిత్ర గత వారం చెన్నైలోని ఒక హోటల్ లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆమె మరణం వెనుక మిస్టరీ ఉందని వచ్చిన వార్తల నేపధ్యంలో నషరత్ పేట పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించారు. ఆమెతో పాటు ఆరోజు హోటల్ లో ఉన్న ఆమె రిజిష్టర్ మ్యారేజ్ భర్త, ప్రియుడైన హేమంత్ కుమార్ పై అనుమానం వచ్చిన పోలీసులు ఆయన్ను పలు కోణాల్లో ప్రశ్నించారు. ఆరు రోజులుగా ప్రశ్చించిన పోలీసులకు మొదట పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. అనేక మందిని విచారించిన పోలీసులు చివరికి తమదైన స్టైల్లో విచారించే సరికి, చిత్ర ఆత్మహత్యకు హేమంత్ కుమార్ ప్రేరేపించినట్లు తేలింది.
లాక్ డౌన్ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి హేమంత్ కుమార్ ప్రేమలో పడ్డ చిత్ర, అన్ లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆగస్టులో నిశ్చితార్ధం చేసుకున్నారు. తిరువాన్మీయూరులో ఓ ఇంటి నిర్మాణం చేపట్టి, చెన్నై శివార్లలోని ఓ కల్యాణ వేదికలో హంగామాగా వివాహం చేసుకోవాలనుకున్నారు ప్రేమ జంట. కానీ… అదే సమయంలో షూటింగ్ పనుల్లో బిజీలో ఉంటున్న చిత్రపై ప్రేమతో పాటు అనుమానం కూడా పెరిగింది హేమంత్ కుమార్ కు. చివరకు హేమంత్ కుమార్ ఒత్తిడితో ఆమె రిజిస్టర్ మ్యారేజ్‌కు అంగీకరించింది.
కరోనా లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో రేయింబవళ్లు షూటింగ్ బిజీలో చిత్ర ఉండడంతో హేమంత్ కుమార్ కు అనుమానం మరింత పెరిగింది. ఇది ఆ ఇద్దరి మధ్య గొడవకు కారణమైంది. చిత్ర ఆత్మహత్య చేసుకున్న రోజు షూటింగ్ స్పాట్ నుంచి చిత్రను అర్ధరాత్రి సమయంలో హోటల్ రూమ్ కు తీసుకువెళ్తున్నప్పుడు కారులో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది. హోటల్ రూం కు వెళ్లిన తర్వాత కూడా వారి మధ్య మరో సారి గొడవ జరిగింది.
ఈ గొడవలో చచ్చిపో అంటూ గట్టిగా ఆమెపై అరిచి హేమంత్ కుమార్ బయటకు వెళ్లి పోయాడు. దీంతో మనస్తాపం చెందిన చిత్ర ఆత్మహత్యకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఆమె ఆత్మహత్యకు హేమంత్ కుమార్ చేసిన వ్యాఖ్యలే ప్రేరణ కావటంతో పోలీసులు సోమవారం రాత్రి అతడ్ని అరెస్ట్ చేశారు. మంగళవారం పూందమల్లి కోర్టులో హజరు పరిచిన అనంతరం పొన్నేరి జైలుకు తరలించారు.
చిత్ర మరణం కేసు విచారణను శ్రీ పెరంబదూరు ఆర్డీవో దివ్యశ్రీ చేపట్టారు. ఆమె తల్లి విజయ, తండ్రి కామరాజ్, సోదరి సరస్వతి, సోదరుడు శరవణన్‌లను విచారించారు.హేమనాథ్ తండ్రి రవిచంద్రన్, తల్లి వసంతల వద్ద కూడా మంగళవారం విచారణ సాగింది. హేమనాథ్‌ను పోలీసులు అరెస్టు చేసిన దృష్ట్యా, ఆయన్ను విచారించాల్సి ఉంది.