దారుణం : అక్కా చెల్లెళ్లను తాళ్ళతో కట్టేసి ఈడ్చుకెళ్లారు

గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి ఇవ్వలేదనే కోపంతో అక్కా చెల్లెళ్లను తాళ్లతో కట్టి రోడ్డుపై ఈడ్చుకెళ్లిన ఘటన పశ్చిమబెంగాల్ లో జరిగింది. ఫటా నగర్ లో నివాసం ఉండే స్మతిఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో టీచర్ గా పని చేస్తూ తన తల్లి, సోదరితో నివసిస్తోంది. ఊళ్లో పంచాయతీ రోడ్డు వేయటానికి గతంలో ఒకసారి వీరికి చెందిన భూమిలో కొంత భాగం ఇచ్చారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు విస్తరణలో భాగంగా వీరికే చెందిన కొంత భూమి కావాలని కోరింది. అందుకు వీరు ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమి ఎక్కువ మొత్తంలో కోల్పోతామని వారు పంచాయతీ వారి అభ్యర్ధనను తిరస్కరించారు.
ఇదేమీ పట్టని పంచాయతీ పెద్దలు ఒకరోజు జేసీబీతో సహా ఇంటికి చేరుకుని రోడ్డు నిర్మాణం చేపట్టారు. దీన్ని అడ్డుకున్న ఇద్దరు అక్క చెల్లెళ్ళపై తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్ తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు. అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ విచక్షణారహితంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. దాడిని అడ్డుకున్న సోదరిని సైతం కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్ సర్కార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ ఘటనపై స్మృతి మాట్లాడుతూ.. ‘దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే కింద పడ్డానో ఆ క్షణం వాళ్లు నా కాళ్లు లాగి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ పోయారు. వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. ఐరన్ రాడ్డుతో తలపై బాదేందుకు ప్రయత్నించారు. చంపుతామని బెదిరించారు అని పేర్కొంది.
బీజేపీ నాయకుడు, బలుర్ఘాట్ ఎంపీ సుకాంత మజుందార్ యువతులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదన్నారు. దీనికి కారణమైన పంచాయతీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా ….ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు దాడికి కారణమైన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.