పుల్వామా దాడిలో కొత్త నిజాలు…వర్చువల్ సిమ్ లు వాడారు

పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబాంబు నిపుణులు దేశంలోకి చొరబడ్డారని ఇప్పటికే తేలగా ఇప్పుడు అత్యాధునిక వర్చువల్ సిమ్ లను దాడికోసం వినియోగించారని తేలింది.ఉగ్రవాదులు వర్చువల్ సిమ్‌లు వాడటాన్ని దర్యాప్తు సంస్థలు ఊహించలేకపోయాయి. ఈ సిమ్ సర్వీస్ ప్రొవైడర్లు అమెరికాలో ఉంటారు. కంప్యూటర్‌లో ఒక టెలిఫోన్ నెంబర్‌ను సృష్టిస్తారు. దీనిని వాడటం కోసం సదరు సర్వీసు ప్రొవైడర్ అప్లికేషన్‌ను మన స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. సోషల్ మీడియా ఖాతాలతో అనుసంధానిస్తే ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. దానిని ఆ యాప్‌కు ఇస్తే వర్చువల్ సిమ్ యాక్టివ్ అవుతుంది. దీని నెంబర్లు ‘+1’ రూపంలో వస్తాయి.
ఈ తరహా నెంబర్లు.. అమెరికాలో వాడటం కోసం వినియోగించే ది మొబైల్ స్టేషన్ ఇంటర్నెషనల్ సబ్‌స్క్రైబర్ డైరెక్టరీ (ఎంఎస్‌ఐఎస్‌డీఎన్)నెంబర్లకు ఉంటాయి. దీంతో పుల్వామాలో వాడిన వర్చువల్ సిమ్ ల సమాచారం కోసం భారత్ అమెరికా సాయం కోరింది. వీటికి చెల్లింపుల వివరాలను కూడా అడిగింది. ముంబయి దాడుల కోసం కూడా ఉగ్రవాదులు ఇటువంటి టెక్నాలజీనే వాడారు.అప్పట్లో దాడులు జరుగుతున్నంతసేపు ఉగ్రవాదులు ఈ సిమ్ కార్డులతో ఉన్న ఫోన్లను వాడారు. ఈ సిమ్ కోసం తప్పుడు వివరాలను పెట్టి 229 డాలర్లను వెస్ట్రన్ మనీ ట్రాన్స్‌ఫర్ ద్వారా సెల్ ఫోనెక్స్ కు పంపించినట్లు గుర్తించారు.
ఈ డబ్బు ఇటలీలోని మదీన ట్రేడింగ్ కంపెనీ ద్వారా జావెద్ ఇక్బాల్ అకౌంట్ కు వెళ్లినట్లు సమాచారం. ఇతను పీవోకేలో నివసిస్తాడు. ఆ తర్వాత ఇద్దరు పాకిస్థానీలను ఇటలీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ ఇక్బాల్ కోసం 300 సార్లు నగదు లావాదేవీలను చేసింది. అయితే ఇక్బాల్ తన జీవితంలో ఎప్పుడూ ఇటలీలో అడుగు పెట్టలేదు. సదరు మదీన ట్రేడింగ్ కంపెనీనే తప్పుడు ఐడీలో నగదు వ్యవహారాలను నడిపింది. ఇప్పుడు పుల్వామాలో కూడా ఇలానే చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.పుల్వామ ఘటన తర్వాత త్రాల్ తో సహా ఇతర చోట్ల జరిగిన ఎన్ కౌంటర్ ప్రదేశాలను దర్యాప్తు సంస్థలు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఆయా చోట్ల దొరికిన ఆధారాలను క్రోడీకరించి చూస్తే పుల్వామా బాంబర్ అదిల్ దార్ దాడి చేసేవరకు సూత్రధారి మదస్సిర్ ఖాన్ తో టచ్ లో ఉన్నట్లు తేలింది.