వైఎస్ వివేకా అంత్యక్రియలకు ఏర్పాట్లు

వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి 24 గంటలు గడిచిపోయింది. అయినా ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి పురోగతిలేదు. ఎవరు చంపారు, ఎందుకు చంపారన్నదానిపై క్లారిటీలేదు. ఓవైపు ఈ హత్యపై అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు… మార్చి 16వ తేదీ శనివారం వివేకా అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పులివెందులలోని తన ఇంట్లో నిద్రిస్తున్న వైఎస్ వివేకాను దుండగులు తలపై నరికి దారుణంగా హత్య చేశారు. పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా తలపై నరకడంతోనే మృతి చెందినట్లు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఆయన శరీరంపై మొత్తం ఏడు చోట్ల నరికిన గాయాలు ఉన్నాయి. ఒక్క తలపైనే ఐదు చోట్ల గాయాలున్నాయి. పోస్టుమార్టం అనంతరం పార్థివదేహాన్ని అభిమానుల కోసం వివేకానందరెడ్డి ఇంటికి తీసుకొచ్చారు.
వివేకా హత్య వార్తతో పులివెందుల కన్నీటి సంద్రంగా మారింది. వైఎస్ జగన్ హుటాహుటిన హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకుని తన చిన్నాన్న భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వైఎస్ కుటుంబసభ్యులతోపాటు వైసీపీ నాయకులు, రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది తరలివచ్చి వివేకా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వైఎస్ వివేకానందరెడ్డి భౌతిక కాయానికి మార్చి 16వ తేదీ శనివారం పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.