AP Inter Improvement 2026 : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. సెకండియర్ వాళ్లు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు
AP Inter Improvement 2026 : ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.. ఇకపై సెకండియర్ వాళ్లు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసుకోవచ్చు.
ap intermediate board allow to improvement for second year students from 2026
AP Inter Improvement 2026 : ఇప్పటి వరకు కేవలం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ రాసుకునే అవకాశం ఉండేది. కానీ ఈ సంవత్సరం నుంచి ఇంటర్ సెకండియర్ విద్యార్థులు కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇకపై సెకండియర్ విద్యార్థులు కూడా తమ మార్కుల్ని పెంచుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ఇంటర్ సెకండియర్ పాస్, ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ప్రథమ సంవత్సరం మాదిరిగానే.. సబ్జెక్టుల వారీగా ఇంప్రూవ్మెంట్ రాసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇంటర్ ఫలితాలను ప్రకటించిన ఇంటర్‌బోర్డు అధికారులు మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సెకండియర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశాన్ని కూడా ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే అమలు చేయనున్నట్లు ఏపీ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
గత నెలలో జరిగిన ఎగ్జామ్స్ రాసిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ.. పాస్ అయిన పేపర్లలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కోసం హాజరు కావొచ్చన్నారు. ప్రతి పేపర్లో ఉత్తమ మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపారు. అలాగే ఫెయిల్ అయిన విద్యార్థులు.. ఆయా సబ్జెక్టుల్లో పాస్ అయ్యేంత వరకు పరీక్షలు రాసుకోవచ్చని.. దీనిపై ఎలాంటి పరిమితి లేదన్నారు. అయితే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదని స్పష్టం చేశారు.
పరీక్ష ఫీజు
పరీక్ష ఫీజు రూ. 600లతో పాటు ఇంప్రూవ్మెంట్ పరీక్షకు ఒక్కో సబ్జెక్టుకు రూ. 160 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
చివరి తేదీ
ఈ ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు అవకాశం కల్పించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
