NTA JEE Main 2026: ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ 2026 షెడ్యూల్ విడుదల.. ఈ సారి 10 రోజుల ముందుగానే..
దేశవ్యాప్తంగా అభ్యర్థులు పరీక్ష రాయడానికి వీలుగా జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను పెంచుతూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది.

NTA JEE Main 2026: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్-2026 సెషన్ 1, 2 పరీక్షల తేదీలను ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం.. జేఈఈ మెయిన్ 2026ను రెండు సెషన్లలో నిర్వహిస్తారు. మొదటిది సెషన్ 2026 జనవరిలో, రెండో సెషన్ 2026 ఏప్రిల్‌లో ఉంటుంది.
జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్ష జనవరి 21 నుంచి 30 వరకు, సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 1 నుంచి 10 వరకు జరుగుతుంది. అయితే, సెషన్ 2 పరీక్షకు వచ్చే దరఖాస్తుల సంఖ్యను బట్టి ఆ పరీక్ష ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 10 రోజుల ముందుగానే తేదీలను వెల్లడించారు.
జేఈఈ మెయిన్ సెషన్ 1 దరఖాస్తు విండో 2025 అక్టోబర్‌లో jeemain.nta.ac.inలో ఓపెన్ అవుతుంది. జేఈఈ మైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడమే లక్ష్యంగా ఎన్‌టీఏ ఆధార్ డేటాబేస్ నుంచి అభ్యర్థి పేరు, పుట్టినతేది, లింగం, ఫొటో, చిరునామా వంటి వివరాలను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ద్వారా ఆటోమేటిక్‌గా పొందుతుంది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం.. ఈ జిల్లాల వారు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జారీ
దేశవ్యాప్తంగా అభ్యర్థులు పరీక్ష రాయడానికి వీలుగా జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించే నగరాల సంఖ్యను పెంచుతూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకుంది. దివ్యాంగుల (పీడబ్ల్యూడీ/పీడబ్ల్యూడీబీడి) కోసం ప్రత్యేక సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
జేఈఈ మెయిన్ 2026 పరీక్షకు సంబంధించి సందేహాలు, సాయం కోసం అభ్యర్థులు ఎన్‌టిఏ అధికారిక వెబ్‌సైట్లు nta.ac.in, jeemain.nta.nic.inలోకి వెళ్లవచ్చు. ఎన్టీఏ హెల్ప్‌డెస్క్ 91-11-40759000కి ఫోన్ చేయొచ్చు. లేదా jeemain@nta.ac.in కి మెయిల్ చేయవచ్చు.
2025లో జేఈఈ మెయిన్‌ను జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించారు. జనవరి సెషన్ పరీక్ష జనవరి 22 నుంచి 30 వరకు, ఏప్రిల్ సెషన్ పరీక్ష ఏప్రిల్ 2 నుంచి 8 వరకు జరిగింది. గత సంవత్సరం జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ జనవరి 2న ప్రారంభమైంది.