ఫస్ట్ ఆన్ ఫస్ట్ : అడ్మిషన్స్ క్లోజ్డ్

  • Published By: madhu ,Published On : January 10, 2019 / 12:25 PM IST
ఫస్ట్ ఆన్ ఫస్ట్ : అడ్మిషన్స్ క్లోజ్డ్

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఉంటున్నారా? మీ పిల్లల్ని ఎల్‌కేజీలో చేర్పించాలనుకుంటున్నారా ? ఏ స్కూల్  బెటర్‌ అని ఎంక్వైరీ మొదలుపెట్టారా? అయితే మీరు చాలా లేటయ్యారు. పేరున్న స్కూళ్లలో ఇప్పటికే అడ్మిషన్స్ పూర్తికావొచ్చాయి. కొత్త విద్యాసంవత్సరం మొదలవ్వడానికి ఇంకా ఆరునెలలు ఉంది కదా అని అనుకుంటున్నారా. మంచి స్కూల్‌లో మీ పిల్లలకు సీటు దొరకాలనే ఉద్ధేశ్యంతో తీరిగ్గా ఎంక్వయిరీలు మొదలుపెట్టారా ? అయితే మీ పిల్లలకు  కార్పొరేట్ స్కూల్స్‌లో కచ్చితంగా సీటు దొరకదు.  ఎందుకంటే అక్కడ అడ్మిషన్ల ప్రక్రియ ముగింపుదశకు చేరుకుంది. అయితే ఇంత జరుగుతున్నా విద్యాశాఖ మాత్రం ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తోందంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 
ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలు 
విద్యాసంవత్సరానికి ఇంకా ఆరునెలల సమయం 
12వేల ప్రైవేటు స్కూల్స్‌ 
జూన్‌లో ప్రారంభమయ్యే  విద్యాసంవత్సరం
నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల ప్రక్రియ

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అడ్మిషన్స్‌ ప్రక్రియ దాదాపుగా పూర్తికావొచ్చింది. తెలంగాణాలో ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలు ఇలా ఉన్నాయి మరి. విద్యాసంవత్సారానికి ఇంకా ఆరు నెలల సమయం ఉండగానే దాదాపుగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేసుకున్నాయి. రాష్ర్టంలో మొత్తం 12వేల ప్రైవేటు స్కూల్స్‌ ఉన్నాయి. దాదాపు బడా బడా స్కూల్స్ లో అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయినట్లే చెప్పొచ్చు. వాస్తవానికి వచ్చే విద్యాసంవత్సరం జూన్‌లో ప్రారంభం అవుతుంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలన్నీ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించాయి. 
జూన్‌లో అడ్మిషన్లు ప్రారంభించాలి..కానీ…
నిజానికి జూన్‌లో స్కూల్స్ అన్ని తమ అడ్మిషన్లు ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ కార్పొరేట్‌ విద్యాసంస్థలు మాత్రం ముందస్తు అడ్మిషన్లు నిర్వహించి తల్లిదండ్రుల వీక్ నెస్ పైన దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లోనే స్కూల్ బయట అడ్మిషన్స్ ఆర్ ఓపెన్ అంటూ నిర్భయంగా బోర్డులు పెట్టేసాయి. అంతేకాదు కొన్ని విద్యాసంస్థల్లో అడ్మిషన్స్‌ క్లోజ్‌డ్‌  అని బోర్డులు కూడా తగిలించేసారు. నిజానికి పాఠశాల, ఇంటర్ విద్యాశాఖలు నోటిఫికేషన్లు విడుదల చేసేంత వరకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడానికి వీలు లేదు.. కాని యధేచ్చగా అన్ని స్కూల్స్ కాలేజీలు… అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించేశాయి. కాని ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
స్కూల్ బయట ఫస్ట్ ఆన్ ఫస్ట్…
స్కూల్ బయట ఫస్ట్ ఆన్ ఫస్ట్ పేరుతో బోర్డులు పెట్టడంతో మరింత కంగారు పడిపోయి తల్లిదండ్రులు మోసపోతున్నారు. అయితే ఇటువంటి స్కూల్స్ పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలంగాణ స్కూల్  పేరెంట్స్  సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు తిరుపతి రావు కమిటీ రిపోర్టు వచ్చి ఇంత కాలం గడుస్తున్నా ఇంతవరకు బహిర్గతం చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం ఫీ రెగ్యులేషన్ చేసే ఆలోచనలో ఉంటే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి చేసిన స్కూల్స్ బ్యాలెన్స్ తిరిగి వెనక్కి ఇస్తారా అని వారు మండిపడుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్లు నిర్వహించిన స్కూల్స్ పై వెంటనే విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని.. ఆయా విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.