Assembly Elections 2023: మధ్యప్రదేశ్‭లో బాహుబలి స్థానాలు ఇవే.. సీఎం శివరాజ్‭కి పోటీగా బజరంగ్ బలిని పోటీకి దింపిన కాంగ్రెస్

2008లో ప్రసారమైన 'రామాయణం' సీరియల్‌లో ఈయన హనుమంతుడి పాత్ర పోషించారు. ఈ యేడాది జూలైలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వాస్తవానికి ఆయన బుద్ని నివాసే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కమల్‌నాథ్‌ను ప్రగతిశీల వ్యక్తిగా మస్తాల్ అభివర్ణించారు.

Assembly Elections 2023: మధ్యప్రదేశ్‭లో బాహుబలి స్థానాలు ఇవే.. సీఎం శివరాజ్‭కి పోటీగా బజరంగ్ బలిని పోటీకి దింపిన కాంగ్రెస్

Updated On : October 15, 2023 / 5:57 PM IST

Assembly Elections 2023: మధ్యప్రదేశ్‌లోని 144 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ల సీనియర్‌ నేతల విశ్వసనీయతకు పెద్దపీట వేసే స్థానాలు చాలానే ఉన్నాయి. ఈ సీట్లలో లహర్, చింద్వారా, బుధ్ని వంటి సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రతిపక్ష నేత కమల్ నాథ్ నుంచి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వరకు సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పెద్ద సీట్లలో సమీకరణాలు ఏమిటో తెలుసుకుందాం.

శివరాజ్‌పై పోటీకి బజరంగ్ బలి
ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఈ సీటును కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది. శివరాజ్ సింగ్ 1990, 2006, 2008, 2013, 2018లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 2003లో బీజేపీకి చెందిన రాజేంద్ర సింగ్ కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఈసారి శివరాజ్‌ మీద విక్రమ్‌ మస్తాల్‌ శర్మను దింపుతోంది కాంగ్రెస్‌ పార్టీ. 2008లో ప్రసారమైన ‘రామాయణం’ సీరియల్‌లో ఈయన హనుమంతుడి పాత్ర పోషించారు. ఈ యేడాది జూలైలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. వాస్తవానికి ఆయన బుద్ని నివాసే. కాంగ్రెస్‌లో చేరిన అనంతరం కమల్‌నాథ్‌ను ప్రగతిశీల వ్యక్తిగా మస్తాల్ అభివర్ణించారు.

కైలాష్ విజయవర్గియకు పోటీగా సంజయ్ శుక్లా
ఇక ఇండోర్-1 నుంచి సీనియర్ నాయకుడు కైలాష్ విజయవర్గియ అనూహ్యంగా బీజేపీ రంగంలోకి దింపింది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున సంజయ్ శుక్లా పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సుదర్శన్ గుప్తాను శుక్లా ఓడించారు. వాస్తవానికి ఆయనకు ఇది బాగా పట్టున్న స్థానం. అలాగే విజయవర్గీయ కూడా బీజేపీలో చాలా పెద్ద సీనియర్ నేత. మరి ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తిగా మారింది.

సాధ్వికి టిక్కెట్టు
ఉమాభారతి ఒకప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన బడా మల్హారా స్థానం నుంచి కాంగ్రెస్‌ పార్టీ సాధ్వి రామ్‌ సియా భారతికి టిక్కెట్‌ ఇచ్చింది. బీజేపీ ఇక్కడ నుంచి ప్రద్యుమాన్‌ సింగ్‌ లోధీని అభ్యర్థిగా నిలిపింది. 2018లో ఇక్కడ నుంచి కాంగ్రెస్‌ టికెట్‌పై లోధీ గెలుపొందారు. 2020లో బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో కూడా గెలిచారు.

ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ గోవింద్ సింగ్ మళ్లీ రంగంలోకి
భింద్ జిల్లాలోని లాహర్ అసెంబ్లీ స్థానం నుంచి డాక్టర్ గోవింద్ సింగ్‌ను కాంగ్రెస్ మళ్లీ పోటీకి దింపింది. ఆయన ఇక్కడి నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు దశాబ్దాలుగా బీజేపీ ఇక్కడ గెలవలేకపోయింది. ఈసారి బీజేపీ నుంచి అంబరీష్ శర్మ గుడ్డు బరిలో ఉన్నారు. శర్మ గతంలో బీఎస్పీలో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు పోటీ గోవింద్, అంబరీష్ మధ్యే ఉందని అంటున్నారు.