Assembly Elections 2023: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మిర్చీ బాబా.. సీఎంపై పోటీ చేస్తారా? మాజీ సీఎంపైనా?
ఆయనకు కాంగ్రెస్ తో ఎంత అనుబంధం ఏర్పడిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్.. భోపాల్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ఓడిపోయారు. కానీ బాబా సమాధి తీసుకోలేదు.

Mirchi Baba: మిర్చి బాబా అలియాస్ రాకేష్ దూబేతో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశమైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వయంగా అఖిలేష్ యాదవే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వెంటనే మిర్చి బాబాయ్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడా అనే చర్చ మొత్తం రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ ఎన్నికల్లో సీఎం శివరాజ్‌పై మిర్చీ బాబా పోటీ చేస్తారని కొందరు, కమల్‌నాథ్‌పై ఆయన పోటీ చేయవచ్చని మరికొందరు అంటున్నారు. అయితే ఈ మొత్తం విషయంలో మిర్చి బాబా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాలేదు. రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ మిర్చి బాబా ఎవరు? ఆయిల్ మిల్లు కార్మికుడి నుంచి మహామండలేశ్వరానికి ఆయన ప్రయాణం ఎలా సాగిందనే విషయాలు తెలుసుకుందాం.
మిల్లు కార్మికుడి నుంచి మిర్చీ బాబాగా
మిర్చి బాబా అలియాస్ రాకేష్ దూబే.. మధ్యప్రదేశ్‌లోని భింద్ జిల్లాలోని బిర్ఖాడి గ్రామ నివాసి. ఆయన తండ్రి అయోధ్య సమీపంలోని మలన్‌పూర్‌లోని ఒక దేవాలయంలో పూజారి. 1997లో మిర్చి బాబా ఆయిల్ మిల్లు కూలీగా పనిచేశారు. అనంతరం గ్రామంలోని భూమిని అమ్మి ట్రక్కు కొన్నారు. ఇందులో నష్టం రావడంతో దాన్ని కూడా అమ్మేశారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని వదిలి గుజరాత్‌కు వెళ్లిపోయారు. అక్కడ అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ మిల్లులో పనిచేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి ఒక సాధువు సంస్థలోకి చేరారు. ఆ తర్వాత రాకేష్ దూబే రిటైరయ్యారు. ఆ తర్వాత వైరాగ్యానంద గిరి అవతారమెత్తారు. క్రమక్రమంగా ఆయన ఖ్యాతి ఎంపీ గ్రామాల్లో పెరగడం మొదలైంది. స్వామి వైరాగ్యానంద్ గిరిలో విశేషమేమిటంటే, ఆయన భక్తులకు కారంపొడి చల్లుతారు. దీంతో ఆయనకు మిర్చి బాబా అనే పేరు వచ్చింది. బాబా పల్లకిలో కూర్చుని భగవత్ పఠిస్తారు. అతని పేరు ప్రఖ్యాతులు భింద్ జిల్లాలో ప్రభలంగా వ్యాపించాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ పదవి
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలతో సంబంధాలు పెరిగాయి. ఆ తర్వాత మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. భోపాల్‌లోని మినల్ రెసిడెన్సీ పొందేందుకు దిగ్విజయ్ సింగ్ సహాయం చేశారని మిర్చి బాబాకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు చెప్పారు. 2018లో ఆయన తండ్రి మరణించడంతో త్రయోదశి సంస్కారంలో దాదాపు 20 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఈ విందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దీంతో ఆ ప్రాంతంలో ఆయన స్థాయి ఒక్కసారిగా ఎక్కడికో పెరిగిపోయింది. 2018లో కమల్‌నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కార్పొరేషన్ ఛైర్మన్‌గా చేసి ఆయనకు రాష్ట్ర మంత్రి హోదాను కల్పించారు. ఆయనకు కాంగ్రెస్ తో ఎంత అనుబంధం ఏర్పడిందంటే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దిగ్విజయ్ సింగ్.. భోపాల్ లోక్‌సభ నుంచి పోటీ చేశారు. అప్పుడు దిగ్విజయ్ ఓడిపోతే తాను జలసమాధి అవుతానని మిర్చి బాబా ప్రకటించారు. అయితే దిగ్విజయ్ ఓడిపోయారు. కానీ బాబా సమాధి తీసుకోలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవడంతో పతనం
బీజేపీ ప్రభుత్వంలో గోవులను రక్షించాలని డిమాండ్ చేస్తూ మిర్చి బాబా ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. అయితే ఆయన మాటలను శివరాజ్ ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ఆయనకు గోమూత్రం, గంగాజలం అందించడంతో ఆయన నిరాహార దీక్షను విరమించారు. కమల్‌నాథ్ ప్రభుత్వం పతనం తర్వాత మిర్చి బాబాకు గడ్డుకాలం మొదలైంది. 2022లో మిర్చీ బాబా తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశాడని 29 ఏళ్ల ఒక మహిళ ఆరోపించింది. దాదాపు 13 నెలల పాటు బాబా జైల్లోనే ఉన్నారు. అనంతరం ఈ కేసులో కోర్టు అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు చెడింది. ఈ విషయంలో కాంగ్రెస్ తనకు మద్దతివ్వలేదని బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబా ఎన్నికల రంగంలోకి దిగగలరా?
ఇక తాజా పరిణామాలు చూస్తుంటే? సమాజ్ వాదీ పార్టీ నుంచి మిర్చీ బాబా పోటీకి దిగుతున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ తర్వాత మిర్చి బాబా ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జోరందకుంది. బుద్నీ స్థానం నుంచి సీఎం శివరాజ్‌పై పోటీ చేయవచ్చని పలువురు అంటున్నారు. ఆయన చింద్వారా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌పై పోటీ చేయవచ్చని కొందరు అంటున్నారు. సీట్ల పంపకానికి సంబంధించి అడిగిన ప్రశ్నలో ‘అఖిలేష్ ఎవరు’ అంటూ కమల్‌నాథ్ వ్యాఖ్యానించడంతో ఆయన మీదనే మిర్చీబాబాను పోటీకి దింపొచ్చని ఊహాగాణాలు వస్తున్నాయి.