ఆ నలుగురు ఎంపీలకు కరోనా.. గుంపులుగా ఉండరాదంటూ దేశవ్యాప్తంగా నిషేధం!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తోంది. చైనా సహా ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఫ్రెంచ్ దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం 1000 మంది కంటే ఎక్కువ జనం ఒకేచోట ఉండటంపై ఆదివారం నిషేధం విధించింది.
కరోనా సోకి ఇప్పటివరకూ ముగ్గురు మృతిచెందారు. కొత్త కరోనా కేసుల సంఖ్య 19కి చేరగా, దాదాపు ఒక రోజులో 20శాతానికి కరోనా ఇన్ఫెక్షన్లు వ్యాపించాయి. ఇప్పుడు తాజాగా నలుగురు ఫ్రాన్స్ ఎంపీలకు కూడా కరోనా లక్షణాలు పాజిటీవ్ గా తేలినట్టు అధికారులు వెల్లడించారు. ఎంపీలు నలుగురిని ఆస్పత్రికి తరలించి ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు.
గతవారమే ఫ్రాన్స్.. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో 5వేల కంటే ఎక్కువ మంది ఒకేచోట ఉండటంపై నిషేధం విధించింది. ఇప్పడు ఈ కొత్త ఆంక్షలతో దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చినట్టు ఆరోగ్య శాఖ మంత్రి ఒలివియర్ వీరన్ ఒక వార్తా సదస్సులో తెలిపినట్టు రాయిటర్స్ నివేదించింది. కరోనా వైరస్ వ్యాప్తిని సాధ్యమైనంతవరకు నిరోధించడమే తమ ప్రధాన కర్తవ్యంగా ఆయన పేర్కొన్నారు.
ప్రజా రవాణా లేదా స్కూల్ పరీక్షలు లేదా రాజకీయ ప్రదర్శనల విషయంలో ఈ ఆదేశాలు వర్తించవు అని చెప్పారు. మరోవైపు జాతీయ ఆరోగ్య అధికారులు… కరోనా మరణాల సంఖ్య ముగ్గురికి చేరిందని, కేసుల సంఖ్య 19కి చేరగా, మొత్తంగా 1,126 కరోనా కేసులు ధ్రువీకరించినట్టు ప్రకటించారు. 24 గంటల్లో 18శాతం వరకు కొత్త కేసులు నమోదు అయినట్టు తెలిపారు.
See Also | మారుతీరావు అంత్యక్రియలు : అమృత వస్తుందా..పోలీసుల భారీ బందోబస్తు