గుండెపోటు రాకుండా నివారించే 7 మంచి రోజువారీ అలవాట్లు…!

గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని మార్పులు మన జీవన విధానంలో అలవాటు చేసుకోవాలి.

గుండెపోటు రాకుండా నివారించే 7 మంచి రోజువారీ అలవాట్లు…!

Heart Attack (Photo Credit : Google)

Updated On : September 28, 2024 / 11:10 PM IST

Heart Attack : ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాల సంఖ్య బాగా పెరిగిపోయింది. చిన్న పెద్ద అనే తేడా లేదు.. సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తోంది. ఎలాంటి జబ్బులు లేని వారు, ఎంతో హెల్తీగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడి చనిపోతున్నారు. గతంలో జబ్బులతో బాధపడే వారిలో ఎక్కువగా హార్ట్ ఎటాక్ లు వచ్చేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. చిన్న చిన్న పిల్లలు సైతం కార్డియాక్ అరెస్ట్ తో మృతువాత పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన అలవాట్లే అంటున్నారు నిపుణులు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మరణాలు CVDల కారణంగా సంభవించాయి. మొత్తం మరణాలలో 31శాతం మంది ఉన్నారు. ఈ మరణాలలో 85శాతం గుండెపోటు, స్ట్రోక్‌లే వల్లే సంభవించాయి. కాగా, గుండెపోటు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే కొన్ని మార్పులు మన జీవన విధానంలో అలవాటు చేసుకోవాలి. గుండెపోటును నివారించడంలో సహాయపడే 7 రోజువారీ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం..

1. రోజూ 30 నిమిషాల నడక..
నడక.. గుండె ఆరోగ్యానికి సులభమైన, అత్యంత ప్రభావవంతమైన వ్యాయామాలలో ఒకటి. బ్రిస్క్ వాకింగ్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. రక్తపోటును తగ్గిస్తుంది. గుండె కండరాలను బలపరుస్తుంది. ప్రతిరోజూ 10 కిలోమీటర్లు నడవాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం 30 నిమిషాలతో ప్రారంభించండి. అది మీ పరిసరాల్లోనే. లేదా ట్రెడ్‌మిల్‌పైన అయినా ఓకే. కానీ, క్రమం తప్పకుండా నడవడం వల్ల మీ గుండెకు ఎన్నో అద్భుతాలు చేస్తుంది.

2. ఆరోగ్యకరమైన పద్ధతిలో బరువు నిర్వహణ..
బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా ఎలాంటి వ్యాధినైనా నివారించవచ్చు. అధిక బరువు రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహాన్ని పెంచుతుంది. ఇవన్నీ గుండెపోటుకు ముఖ్యమైన ప్రమాద కారకాలు. గుండెపై ఒత్తిడి చేస్తాయి. సమతుల్య ఆహారం, తరచుగా వ్యాయామం బరువుని నియంత్రణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. కొంచెం బరువు తగ్గినా.. మీ గుండె ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.

3. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించండి..
ప్రాసెస్ చేయబడిన ఆహారాలు అనారోగ్యకరమైన కొవ్వులు, చక్కెరలు, సోడియంతో నిండి ఉంటాయి. ఇవన్నీ కాలక్రమేణా గుండెకు హాని చేస్తాయి. బయటి భోజనం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ధమనులు మూసుకుపోయి కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు వంటి పోషకమైన ఆహారాన్ని తినడంపై ఎక్కువ దృష్టి పెట్టడం ఉత్తమం. ప్రాసెస్ చేసిన భోజనాన్ని తొలగించడం వల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉండే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

4. మెడిటేషన్ కు సమయం కేటాయించండి..
గుండె ఆరోగ్యం విషయానికి వస్తే.. ఒత్తిడికి గురవడం చాలా ప్రమాదం. ఒత్తిడి సైలెంట్ కిల్లర్‌లా పని చేస్తుంది. నిరంతర ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. ఇది రక్తపోటు, గుండె జబ్బులకు కారణం అవుతుంది. రెగ్యులర్, స్థిరమైన ధ్యానం ఒత్తిడి స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. ప్రతి రోజు 10 నుండి 15 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీ శ్వాసపై దృష్టి పెట్టండి. ఒత్తిడిని వదిలేయండి. ఈ అలవాటు మనస్సును ప్రశాంతంగా ఉంచడమే కాకుండా మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

5. విరామం తీసుకోండి..
ఇది ఉరుకు పరుగుల జీవితం. ఈ బిజీ లైఫ్ లో చాలామంది విరామం తీసుకోవడం పూర్తిగా మర్చిపోయారు. ఇలాంటి లైఫ్ స్టైల్ ఒత్తిడికి దారితీస్తుంది. కాలక్రమేణా స్థిరమైన ఒత్తిడి మీ హృదయానికి హాని కలిగించవచ్చు. అందుకే, ప్రతి కొన్ని గంటలకు, మీ పని నుండి విరామం తీసుకోండి. కాసేపు అటు ఇటు తిరగండి. లేదా స్వచ్ఛమైన గాలిని పీల్చండి. దీన్ని అలవాటు చేసుకోండి. ఇలా మానసిక, శారీరక విరామాలను ఇచ్చినప్పుడు మీ హృదయాన్ని రిఫ్రెష్ చేయడం, ఆరోగ్యంగా ఉంచుకోవడం సులభం అని నిపుణులు చెబుతున్నారు.

6. ద్రవాలు తీసుకోండి..
తరుచూగా నీరు తాగండి. నీరు కేవలం దాహాన్ని తగ్గించడానికే కాదు గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనది కూడా. ఆరోగ్యకరమైన నీటి వినియోగాన్ని కొనసాగించడం వలన మీ ప్రసరణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. స్వేచ్ఛగా ప్రవహించేలా చేస్తుంది. ఇది మీ గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. డిహైడ్రేషన్ మీ రక్తాన్ని చిక్కగా చేస్తుంది. ఇది మీ గుండె పంపింగ్ చర్యను కష్టతరం చేస్తుందన్నది గుర్తుంచుకోండి.

7. బాగా నిద్రపోండి..
నిద్ర.. శరీరం తనను తాను రిపేర్ చేసి, పునరుద్ధరించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. గుండె చేసేది కూడా ఇదే. అనారోగ్యకరమైన నిద్ర అలవాట్లు గుండె జబ్బులు, అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. ప్రతి రోజు రాత్రి వేళ కనీసం 7 గంటల పాటు మంచి నిద్ర పట్టేలా ప్రయత్నం చేయాలన్న నిపుణుల మాట.

Also Read : ‘లైట్‌హౌస్‌ పేరెంటింగ్‌’‌ ఏంటి? ఈ విధానంతో కలిగే ప్రయోజనాలేంటి? పిల్లల ఆత్మగౌరవంపై ఎలాంటి ప్రభావం ఉంటుందంటే?