గరీబ్ రథ్ రైల్లో కరోనా అలజడి.. చేతికి క్వారంటైన్ ముద్రతో నలుగురు ప్రయాణం!

భారత్‌లో కరోనా వైరస్ నెమ్మదిగా విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఒకవైపు దేశవ్యాప్తంగా కఠిన చర్యలు చేపడుతున్నప్పనటికీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోంది. విదేశాల నుంచి దేశంలోకి ప్రవేశించేవారిలో కొంతమంది నిర్లక్ష్యంతో అందరూ కరోనా ముప్పును ఎదుర్కోవాల్సి వస్తోంది. విదేశాల నుంచి వచ్చిన ఓ నలుగురు యువకులు ముంబై నుంచి ఢిల్లీకి గరీబ్ రథ్ రైల్వే ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు.
అయితే ఆ నలుగురి చేతికి క్వారంటైన్ ముద్ర ఉంది. అంటే.. కరోనా అనుమానితులుగా గుర్తించిన వారికి ఈ ముద్ర వేస్తారు. జనసమూహాల్లో కలవకుండా వారిని క్వారంటైన్ లేదా ఇంట్లోనే ఉండేలా అధికారులు సూచనలు చేస్తున్నారు. అయితే వీరు మాత్రం అధికారుల సూచనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా రైల్లో ప్రయాణించారు. ఎవరి కంటపడకుండా మెల్లగా రైల్లో ప్రయాణిస్తున్నా కూడా అధికారులు ఎవరూ గుర్తించలేకపోయారు.
అదే రైల్లో విధులు నిర్వహిస్తున్న టీసీ డహాణు స్టేషన్ వద్ద ఈ నలుగురి చేతిపై ఉన్న ముద్రను గుర్తించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ రైలును పాల్ఘర్ స్టేషన్‌లో నిలిపివేశారు. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురిని కిందికి దింపేశారు. జర్మనీ నుంచి వచ్చిన ఈ నలుగురు పాల్ఘర్‌లో వైద్య పరీక్షల కోసం ఎదురు చూసేందుకు నిరాకరించారు.
ఢిల్లీలోని తమ ఇంటికి వెళ్తామని పట్టుబట్టారు. చివరకు రాష్ట్ర కరోనా కంట్రోల్ రూమ్‌తో సంప్రదించిన అనంతరం వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం ఓ ప్రైవేటు వాహనంలో నలుగురిని సూరత్ పంపించారు. మరోవైపు మహారాష్ట్రలో కరోనా బాధితుల సంఖ్య 47కు చేరుకుంది. లండన్ నుంచి ముంబై వచ్చిన ఓ యువతికి, దుబాయ్ నుంచి వచ్చిన ఒక మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా బాధితుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించడానికి అదనంగా మరో 8 ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే తెలిపారు. కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండేలా బీఎంసీ సైతం కఠిన చర్యలు చేపట్టనుంది. రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేస్తే ఏకంగా రూ.1000 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
See Also | కామారెడ్డిలో కరోనా కలకలం, ఆర్మీ జవాన్‌కు కొవిడ్ వైరస్