Mouth ulcers: మాటిమాటికీ మౌత్ అల్సర్స్ వస్తున్నాయా? నోటి పూతే కదా అని లైట్ తీసుకుంటున్నారా?

నోటి పూత (మౌత్ అల్సర్) ఒక సాధారణ సమస్య అనుకుంటారు. చాలామంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఇది ఎవరికి అయినా, ఏ వయస్సులోనైనా రావచ్చు. మౌత్ అల్సర్ సాధారణంగా నోటి లోపలి భాగంలో, నాలుకపై, చెంపల లోపలి భాగంలో, పెదవుల లోపల లేదా గొంతులో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి. తినటం, త్రాగటం, మాట్లాడటం లేదా నోటిని కదిలించడం కూడా కష్టంగా మారుతాయి. బహుశా, ఎక్కువ సందర్భాల్లో ఈ మౌత్ అల్సర్ కొన్ని రోజుల లోపు తగ్గిపోతుంది. కానీ అవి మళ్లీ మళ్లీ వస్తుంటే లేదా చాలా రోజులపాటు మానకపోతే నిర్లక్ష్యం చేయొద్దు. ఈ పుండ్లు శరీరంలో ఉన్న కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. తరచుగా మౌత్ అల్సర్ రావడం వల్ల ఏయే ఆరోగ్య సమస్యలు కలుగుతాయో తెలుసుకుందాం.
1. పోషకాహార లోపం
తరచుగా మౌత్ అల్సర్ రావడానికి ప్రధాన కారణం శరీరంలో పోషకాహార లోపం కావచ్చు. విటమిన్ B12, ఐరన్, జింక్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాల లోపం మౌత్ అల్సర్ ఏర్పడే అవకాశాలను పెంచుతుంది. ఈ పోషకాలు శరీర రోగనిరోధక శక్తిని బలపరిచేలా పనిచేస్తాయి. నోటిలోని మ్యూకస్ మెంబ్రేన్ ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. మీ ఆహారంలో ఇవి సరిపడా లేకుంటే, శరీరంలో వాటి కొరత ఏర్పడి మౌత్ అల్సర్ రావచ్చు.
2. జీర్ణకోశ సంబంధిత సమస్యలు
మరొక ముఖ్యమైన కారణం జీర్ణ సంబంధిత సమస్యలు కావచ్చు. కడుపులో గ్యాస్, అసిడిటి, మలబద్ధకం, లేదా అజీర్ణం వంటి సమస్యలు శరీరంలో విష పదార్థాల స్థాయిని పెంచుతాయి. దీంతో మౌత్ అల్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆయుర్వేదం ప్రకారం, పిత్త దోషం పెరగడం మౌత్ అల్సర్ కు ప్రధాన కారణం కావచ్చు. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారా? తరచుగా మౌత్ అల్సర్ వస్తున్నాయా? అయితే, మీ శరీరంలో అంతర్గత సమతుల్యత లోపించిన సూచన కావచ్చు.
3. రోగనిరోధక శక్తి లేకపోవడం
మరొక ముఖ్యమైన కారణం రోగనిరోధక శక్తి తగ్గడం. శరీర రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు, శరీరం ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడలేదు. దీని కారణంగా నోటిలో బాక్టీరియా లేదా వైరస్ సంక్రమణ ఏర్పడి మౌత్ అల్సర్ రావచ్చు. కొంతమందిలో ఆటోఇమ్యూన్ వ్యాధులు (ఉదా: లూపస్ లేదా సీలియాక్ వ్యాధి) మౌత్ అల్సర్కు కారణమయ్యే ప్రమాదం ఉంది.
4. మానసిక ఒత్తిడి, ఆందోళన
మానసిక ఒత్తిడి (స్ట్రెస్), ఆందోళన (యాంక్సైటీ) శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఒత్తిడి ఉన్నప్పుడు, శరీరంలో కార్టిసోల్ హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని బలహీనపరిచే ప్రమాదం ఉంది. అలాగే, ఒత్తిడి కారణంగా శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరిగి, మౌత్ అల్సర్ రావడానికి కారణమవుతుంది. తరచూ పుండ్లు వస్తుంటే, మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఇది సంకేతం.
5. ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు
మౌత్ అల్సర్ తరచుగా రావడానికి ఒక తీవ్రమైన కారణం ఇన్‌ఫెక్షన్ కావచ్చు. కొన్ని వైరల్, బాక్టీరియా సంక్రమణలు (ఉదా: హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ లేదా క్యాండిడా ఇన్‌ఫెక్షన్) మౌత్ అల్సర్కు కారణమయ్యే అవకాశం ఉంది. మీరు తరచుగా మౌత్ అల్సర్తో పాటు బరువు తగ్గడం, జ్వరం, గొంతు నొప్పి వంటి ఇతర లక్షణాలను కూడా అనుభవిస్తుంటే, అది తీవ్రమైన వ్యాధికి సంకేతంగా ఉండొచ్చు. అటువంటి పరిస్థితిలో వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.