Jaya Prakash Narayana : దేశంలో ఈ మూడు జరిగితే కరోనా అంతం ఖాయం.. జేపీ విలువైన సూచనలు

కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖతం చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి ప్రణాళిక అవసరం? దీని గురించి టెన్ టీవీలో రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ సూచనలు, సలహాలు ఇచ్చారు.

Jaya Prakash Narayana : దేశంలో ఈ మూడు జరిగితే కరోనా అంతం ఖాయం.. జేపీ విలువైన సూచనలు

Jaya Prakash Narayana

Updated On : May 23, 2021 / 4:13 PM IST

Jaya Prakash Narayana On Corona : కరోనావైరస్ మహమ్మారి యావత్ దేశాన్ని వణికిస్తోంది. విలయతాండవం చేస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ లో కరోనా మహమ్మారి తీవ్రత ఊహకు అందని విధంగా ఉంది. యావత్ దేశం విలవిలలాడిపోతోంది. మరి ఈ మమహ్మరిని ఖతం చేయాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి ప్రణాళిక అవసరం? దీని గురించి టెన్ టీవీలో రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ జయప్రకాశ్ నారాయణ సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఇలాంటి పరిస్థితుల్లో గుండె నిబ్బరం చాలా అవసరం. కంగారు, హడావుడి పడకూడదు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాలం ఆగదు. మన దేశంలో ఒక పక్క కరోనా, మరోపక్క ఎప్పుడూ లేని విధంగా పశ్చిమ తీరాన అరేబియా సముద్రం నుంచి తుఫాన్లు. సాధారణంగా అరేబియా సముద్రం నుంచి తుఫాన్లు రావు. బంగాళాఖాతం, తూర్పు తీరం నుంచి వస్తాయి. ఇప్పుడేమో తూర్పుతీరాన పెద్ద తుఫాన్ పెను ముప్పు పొంచి ఉంది. మధ్యలో ఈ రాజకీయాలు, ఎన్నికలు. ఒక పెద్ద దేశం ఇవన్నీ తట్టుకోవాలి. ఉదాహరణకు అమెరికాలో ఒకే సమయంలో పెను తుఫాన్లు చాలా వచ్చాయి. కరోనా విపరీతంగా వచ్చింది. మనకు లేని కార్చిచ్చు కొన్ని లక్షల హెక్టార్లలో చోటు చేసుకుంది. అడవులులు అగ్నికి దహనం అయ్యాయి. మన దేశంలోలానే ఆ దేశంలోనూ ఎన్నికలు, రాజకీయాల హడావుడి ఉంది.

ఏడాది క్రితం వ్యాక్సిన్లు లేవు. కానీ ఇప్పుడు సురక్షితమైన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఏడాది క్రితం ఎంతో డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని భయంతో బతుకుతూ మనందరి ప్రాణాలు కాపాడాలంటే వారికి సాధ్యం కాదు. కాబట్టి నిబ్బరం కావాలి. ఈ ఉపద్రవాన్ని భారత్ మాత్రమే కాదు యావత్ మానవాళి ఎదుర్కోంటోంది. ఇలాంటి ముప్పును సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, శాస్త్రీయ విజ్ఞానం మానవాళికి ఉన్నాయనే ధైర్యం కావాలి. ప్రతి మనిషికి ఈ ధైర్యం కావాలి. అయ్యో రేపు ఏమవుతుందో, చనిపోతాం ఏమో, కరోనా వస్తే బతకనేమో అనే భయం మరింత ప్రమాదాన్ని తెస్తుంది. మొట్టమొదట మనం చేసేది అదే.

రెండో పద్ధతి ప్రకారం చేయాలి. ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్ దొరకాలి. 15రోజుల చర్యల వల్ల ఇవాళ ఇన్ ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయి. నెల రోజుల క్రితం చర్యల వల్ల ఇవాళ మరణాలు తగ్గుతాయి. మరణాలు నిలుపుకోవాలి.

ఇక మూడోది.. వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచాలి. ప్రజలందరికి టీకాలు అందాలి. వచ్చే 6 నెలల్లో దేశంలో కనీసం నూటికి 70మందికి 18ఏళ్లు దాటిన వారందరికి టీకాలు సాధ్యం. యుద్ధ ప్రాతిపదికన చేసినట్లు అయితేనే. దీర్ఘకాలం కొవిడ్ వల్ల అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, దానికి చికిత్స కోసం ఏర్పాట్లు జరగాలి. వ్యాధికి గురై ప్రాణాలు పోతే అదొక దురదృష్టం. కానీ, ప్రాణాలు నిలిచినా.. దీర్ఘకాలిక వ్యాధి ఉంటే అది మరొక ఇబ్బంది అవుతుంది. దాన్ని ఎలా ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాలి. వీటన్నింటితో పాటు ప్రజల్లో ధైర్యం కావాలి. మనో నిబ్బరం కావాలి. భవిష్యత్తు బాగుంటుంది అనే విశ్వాసం కలగాలి. ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనే శక్తి భారత్ కు ఉంది. అది వైద్య పరంగా కావొచ్చు, ఆరోగ్య పరంగా కావొచ్చు. సామాజికంగా, ఆర్థికంగా కావొచ్చు. ఏనాడూ లేని ఆయుధాలు, పనిమూట్లు మన చేతిలో ఉన్నాయి. మన దేశానికే ఉన్నాయి.

కాబట్టి భయం, ఆందోళన అక్కర్లేదు. ఆర్థిక వ్యవస్థ నిలబెడుతూనే మనం ఈ దేశంలో థర్డ్ వేవ్ లో కొత్త రకం వేరియంట్లు వచ్చి మళ్లీ ఇన్ ఫెక్షన్స్ సోకుకుండా కాపాడుకోవాలి. దానికి మన చేతుల్లో ఉన్న ఆయుధాలు రెండు. ఒకటి.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయకుండా ఆంక్షలు పాటించడం. రెండోది.. వ్యాక్సిన్లు అందరికి అందేలా చూసి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుకుండా చూడటం. మూడో మార్గం ప్రస్తుతానికి ఏమీ లేదు. భయపడాల్సిన పని లేదు. దీని వల్ల మంచి కూడా ఉంది. ఆరోగ్యం మీద ప్రజల్లో ఆలోచన పెరుగుతుంది. 70ఏళ్ల నిర్లక్ష్యం ఇది. కోవిడ్ వల్ల వచ్చిన సమస్య కంటే ఆరోగ్య వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన సమస్య వల్ల ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు ఎక్కువమంది బాధలకు గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్సకు లక్షలు రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి పేద కుటుంబాలకు ఎందుకొచ్చింది? ఈ దేశంలో ఆరోగ్య వ్యవస్థ అనేది లేదు కాబట్టి. ప్రజలను మీ చావు మీరు చావడం అని వదిలేశారు కాబట్టి. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలి. మంచి ఆరోగ్య వ్యవస్థను నిర్మాణం చేయాలి. డబ్బు, హోదా, పరపతి, కులంతో సంబంధం లేదు. ఎవరికైనా వ్యాధి రావొచ్చు, ప్రాణం పోవచ్చు. ఎవరూ గొప్ప వాళ్లు కాదు. కాబట్టి వీఐపీ కల్చర్ పోయి, సమాజంలో అందరి కోసం మనం కొన్ని ఏర్పాట్లు చేయకపోతే అందరం నష్టపోతాం అన్నది గుర్తించాలి.