ముందు జాగ్రత్తలు పాటిద్దాం..కరోనాను అరికడదాం

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా తెలంగాణలోని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఉండే వ్యక్తికి సోకటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్ లో మొత్తం 6 కరోనా కేసులు నమోదైనట్లు అధికార లెక్కలు చెపుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోనూ మరో వ్యక్తికి కరోనా లక్షణాలు బయట పడటంతో అతడ్ని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జిన్న రాజయ్య (50)కు కరోనా సోకిందనే అనుమానం కలుగుతోంది. వ్యాధి లక్షణాలు కనిపించడంతో మొదట కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బాధితుడుకి చికిత్స అందించారు. అయితే రాజయ్య వారం క్రితమే దుబాయ్ నుంచి వచ్చినట్లు కుటుంబ సభ్యలు చెప్పడంతో అక్కడి వైద్యులు ముందు జాగ్రత్త చర్యగా అతడిని సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్ నుంచి భారత్‌కు చేరకుని వారం అవుతోందని, అప్పటి నుంచి తీవ్ర జ్వరం, తుమ్ముల, వాంతులు వస్తున్నాయని కుటుంబ సభ్యులు వివిరించారు. దీంతో అతనికి వైరస్ సోకి ఉండొచ్చన్న అనుమానంతో గాంధీకి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ప్రజలను అప్రమత్తం చేసేలా విస్తృతంగా ప్రచారం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పోస్టర్‌ను విడుదల చేసింది. వైరస్ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా మసలుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. కరచాలనాలకు దూరంగా ఉండటం, చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవడం శ్రేయస్కరమని, ముఖ్యమైన సూచనలు పాటించాలని సూచించారు.
‘కరోనా వైరస్ గాలితో ఇతరులకు వచ్చే ఆస్కారం లేదు. ఇప్పటి వరకు కరోనా వైరస్ వచ్చిన వారిలో ౩శాతం కూడా మరణాలు లేవు. కరోనా వైరస్ ఉన్నవారు మాట్లాడినప్పుడు తుప్పిర్లు ముఖంపై పడితే వచ్చే అవకాశం ఉంది. వైరస్ వచ్చిన వ్యక్తి కలిసినప్పుడు, మాట్లాడినప్పుడు వచ్చే అవకాశం ఉందని’ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు.