హైదరాబాద్‌లో 350 హాస్పిటళ్లకు జీహెచ్ఎంసీ నోటీసులు

ఎల్బీ నగర్లోని చిల్డ్రన్ హాస్పిటల్‌లో ఘటన జరిగిన రెండ్రోజుల్లోనే జీహెచ్ఎంసీ ప్రైవేటు హాస్పిటళ్లకు షాక్ ఇచ్చింది. నియమాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 350హాస్పిటళ్లను మూసివేయాలంటూ నోటీసులు అందించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ విశ్వజిత్ కంపాటి మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 1500హాస్పిటళ్లలో అధికారులు తనిఖీలు చేసి వచ్చే మూడు రోజుల్లో ఆసుపత్రులన్నింటిలో సేఫ్టీ పరికరాలు ఉండేలా చేస్తామని తెలిపారు.
ఇందులో భాగంగా ప్రైవేట్ హాస్పిటళ్లతో పాటు ప్రభుత్వ హాస్పిటళ్లకు మినహాయింపు ఇవ్వదలచుకోలేదు. 350హాస్పిటళ్లు సరైన అనుమతులు లేకుండా నడుస్తున్నాయని, కొన్నింటికి బిల్డింగ్ అప్రూవల్ కూడా లభించలేదని వెల్లడించారు. నోటీసులు అందుకున్న హాస్పిటళ్లు తగిన డాక్యుమెంట్లు తీసుకుని ఈవీడీఎం అధికారులను సంప్రదించాలని సూచించారు.
నియమాలకు విరుద్ధంగా నిర్మించిన హాస్పిటళ్లను సీజ్ చేస్తామన్నారు. తెలంగాణలో మొత్తం 4వేల 200ఆరోగ్య కేంద్రాలు ఉండగా వాటిలో 1500కేంద్రాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. తొలి దశలో భాగంగా పబ్‌లు, బార్లు సోదా తనిఖీ చేశాం. ఫేజ్ 2లో స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు పూర్తయ్యాయి. మేం మూడో దశలో హాస్పిటళ్లను తనిఖీలు చేసేలోపే ఈ ఘటన జరిగిందని వెల్లడించారు.