ఆర్టీసీ కార్మికులకు డెడ్‌లైన్: అప్పట్లోగా చేరితేనే ఉద్యోగాల్లో ఉంటారు- కేసీఆర్

ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ మరోసారి డెడ్ లైన్ ప్రకటించారు. అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లిన కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఛాన్స్‌లిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఛాన్స్ ఇచ్చారు. 2019, నవంబర్ 02వ తేదీ శనివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించారు. కార్మికుల పొట్ట కొట్టాలని తమ ప్రభుత్వం అనుకోదని..వారి భవిష్యత్ కోసం తమ ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడాల్సిన అవసరం ఉందన్నారు.
యూనియన్ల మాయలో పడిపోవద్దని..కఠినంగా అణిచివేసే ధోరణిలో తమ ప్రభుత్వం లేదని..ఈ క్రమంలో వారికి ఒక అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. 2019 నవంబర్ 5వ తేదీ మంగళవారం అర్ధరాత్రి లోపు.. బేషరతుగా డ్యూటీలో చేరవచ్చని..అన్ని రకాల భవిష్యత్ ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన పోటీ వాతావరణంలో రవాణాను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
మొత్తంగా ప్రైవేటుకు ఇవ్వమని, ఆర్టీసీ మనుగడలో ఉండాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికల్ చట్టంలో కొన్ని అంశాలున్నాయని తెలిపారు. ప్రైవేటు రూట్ పర్మిట్లు ఇవ్వవచ్చని..మంచి సేఫ్టీ రావాల్సి ఉందని..ఇలా ఎన్నో ఉన్నాయన్నారు. ప్రైవేటు బస్సులు గవర్నమెంట్ నియంత్రణలో ఉంటుందని..టికెట్లు పెంచే అవకాశం లేదన్నారు.
పాస్ హోల్డర్స్ ఎలాంటి చింత అవసరం లేదని భరోసా ఇచ్చారు. కార్మికుల పట్ల వ్యతిరేకత లేదని..నాలుగు సంవత్సరాల పాలనలో కార్మికులకు 67 శాతం వరకు జీతాలు పెంచిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కతుందన్నారు. 4 వేల 720 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినట్లు గుర్తు చేశారు. 23 కేటగిరీ ఉద్యోగులకు రకరకాల సౌకర్యాలు కల్పించడం జరిగందన్నారు సీఎం కేసీఆర్.
Read More : ఆర్టీసీపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం : ప్రైవేటు బస్సులకు రూట్ పర్మిట్లు