హైదరాబాద్: గూగుల్ మ్యాప్స్ తో ట్రాఫిక్ కంట్రోల్

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతోంది. మెట్రో ట్రైన్ అందుబాటులోకొచ్చినా రోజురోజుకూ పెరుగుతున్న వాహనాలతో సమస్య కొనసాగుతునే ఉంది. ఇక ఐటీ కారిడార్ లలో అయితే చెప్పనే అక్కరలేదు. వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు గూగుల్ ప్రతినిధులతో కలిసి మరో ప్రయోగం చేపట్టారు. ప్రస్తుత ట్రాఫిక్ సమస్యలతో పాటు భవిష్యత్ అవసరాల దృష్టిలో పెట్టుకున్న పోలీసులు టెక్నాలజీని వినియోగించనున్నారు.గూగుల్ మ్యాప్స్ డేటా ఆధారంగా ట్రాఫిక్‌ను సమస్య పరిష్కరించనున్నారు. ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా వినియోగించే ఈ కొత్త పద్ధతి ఎక్స్ పరిమెంట్ స్టేజ్ లో ఉంది.
ఆగస్టు 22వ తేదీన గూగుల్ సంస్థ ప్రతినిధులతో సైబరాబాద్ సీపీ సజ్జనార్ సమావేశమై కీలక అంశాలపై చర్చించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరించేందుకు గూగుల్ డేటాకు లింక్ చేసే విషయంపై చర్చించి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. గూగుల్ డేటాతో ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఆపరేట్ చేయడం, ట్రాఫిక్ సమస్యలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్యల్ని అంచనా వేసి దానికి ఆల్టర్నేటివ్ చర్యల్ని చేయటంతో పాటు ప్రమాదకర ప్రాంతాలను గుర్తించే అవకాశం ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టం ప్రస్తుతం ఎక్స్ ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.
గూగుల్ మ్యాప్స్ డేటా ఆధారంగా గచ్చిబౌలి జంక్షన్ వద్ద రెండు నెలల పాటు ఆధునిక ట్రాఫిక్ సిగ్నలింగ్ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేయగా సత్ఫలితాలు వచ్చాయని సీపీ తెలిపారు. దీంతో వాహనదారులు సిగ్నల్స్ వద్ద వెయిట్ చేసే సమయం 30 శాతం తగ్గింది. 50 శాతం క్యూలైన్లు తగ్గిపోయినట్లు సీపీ గుర్తించారు. ట్రాఫిక్ సమస్యల నివారణతోపాటు గూగుల్ డేటా టెక్నాలజీతో రోడ్ల రిపేర్లతో పాటు ఆయా ప్రాంతాలలో ఉండే సమస్యల్నని కూడా గుర్తించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం సైబరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని భావిస్తున్న అధికారులు త్వరలో నగరమంతా దీన్ని అమలు చేయనున్నారు. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్‌ను గుర్తించి సిగ్నల్స్‌ను క్రమబద్ధీకరించే ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తే నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి.