బోరబండలో భూకంపం.. అక్టోబర్ నెలలోనే ఎందుకిలా?

  • Published By: naveen ,Published On : October 3, 2020 / 05:29 PM IST
బోరబండలో భూకంపం.. అక్టోబర్ నెలలోనే ఎందుకిలా?

Updated On : October 3, 2020 / 6:00 PM IST

earth quake in borabanda: హైదరాబాద్ బోరబండలో వరుస భూ ప్రకంపనలు ఆందోళన కలిగిస్తున్నాయి. భూమి నుంచి భారీ శబ్ధాలు వస్తుండటంతో.. స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. శుక్రవారం(అక్టోబర్ 2,2020) రాత్రి 8 గంటల 15 నిమిషాలకు మొదటగా కంపించిన భూమి.. అర్థరాత్రి వేళ స్థానికులకు కునుకు లేకుండా చేసింది. తెల్లవారుజామున కూడా భూమి కంపించడంతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. అసలేం జరుగుతుంతో తెలియక భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే జీహెచ్‌ఎంసీ బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. భారీ శబ్ధాలు వస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. శబ్దాలు రావడం వెనుకున్న కారణాలు, పరిస్థితిపై సమీక్షించారు. ఇక శాస్త్రవేత్తల స్పెషల్‌ టీమ్స్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి.. అసలు ఈ ప్రకంపనలు ఎందుకొచ్చాయనే దానిపై ఆరా తీశారు.

బోరబండ సైట్‌ త్రీలో ఒక్కసారిగా భూమి నుంచి భారీ శబ్దాలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బోరబండ సహా రహమత్ నగర్, అల్లపూర్ ప్రాంతాల్లో ఈ భారీ వింత శబ్దాలు వినిపించాయి. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి పరుగులు తీశారు. గతంలో కూడా ఇదే విధంగా శబ్దాలతో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు.

భూమి నుంచి భారీ శబ్దాలు.. వీకర్స్ కాలనీ ప్రాంతంలో ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. శుక్రవారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు సుమారు 15 సెకన్ల పాటు భారీ శబ్దాలు వచ్చాయంటూ ప్రజలు చెబుతున్నారు. అర్థరాత్రి సమయంలో కూడా మరో రెండు సార్లు భూమి కంపించిందని.. 2017 అక్టోబర్‌లోనూ ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ పెద్ద పెద్ద శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు. సమీపంలో పరిశ్రమల వంటివి ఏమీ లేవని, అయినా ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. బోరబండలో వచ్చిన శబ్దాలు భూకంపమేనని.. కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు అధికారులు. బోరబండ సైట్ త్రీలో ప్రకంపనలు రేగాయని.. 1.4 తీవ్రతతో భూ కంపం వచ్చినట్లు NGRI గుర్తించినట్లు తెలుస్తోంది.

అర్థరాత్రి 11.24 నిమిషాలకు మరోసారి భూమి కంపించినట్లు స్థానికులు చెప్పారు. బోరబండ సైట్‌-3, ఎఫ్‌సీఆర్‌ హిల్స్‌, జూబ్లీహిల్స్‌, రహమత్‌ నగర్‌ ప్రాంతాల్లో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఇక 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు ఎన్ జి ఆర్ ఐ గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇదే విధంగా భారీ శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు కూడా అక్టోబర్‌లోనే భూమి కంపించిందన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని జూబ్లీహిల్స్ సీఐ సత్తయ్య సూచించారు. బోరబండలో వచ్చిన శబ్దాలపై శాస్త్రవేత్తలతో చర్చిస్తున్నామని తెలిపారు.

విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. నాలుగేళ్ల కిందట కూడా ఇలాంటి శబ్దాలే వచ్చాయని.. కానీ అది భూకంపం కాదన్నారు డిప్యూటీ మేయర్. రాళ్ల మధ్యలోంచి నీళ్లు వెళ్తున్న సమయంలో శబ్దాలు వచ్చినట్లు గతంలో శాస్త్రవేత్తలు నిర్ధారించారన్నారు. ప్రజలెవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆయన భరోసా ఇచ్చారు.

వరుస భూకంపాలతో.. బోరబండ వాసులు భయంభయంగా బతుకుతున్నారు. భూకంపాల విషయంలో బోరబండ డేంజర్ జోన్‌లో ఉందా అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 15 సెకన్ల పాటు బోరబండ ప్రాంతంలో భూమి కంపించింది. రాత్రి 11 గంటల 35 నిమిషాలకు ఓసారి.. తెల్లవారుజామున మరోసారి భూ ప్రకంపనలు స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఇక 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు NGRI గుర్తించింది. 2016, 2017లో కూడా బోరబండలో భూ ప్రకంపనలు రాగా.. బోరబండలో వరుస భూప్రకంపనలకు కారణం ఏంటనేది అంతుచిక్కడం లేదు.