అర్థరాత్రి వరకు ఫోన్లలోనే : హైదరాబాద్ నిద్రపోవటం లేదు

  • Published By: madhu ,Published On : March 15, 2019 / 06:08 AM IST
అర్థరాత్రి వరకు ఫోన్లలోనే :  హైదరాబాద్ నిద్రపోవటం లేదు

హైదరాబాద్ ప్రజలు నిద్రపోవడం లేదు. గతంలో రాత్రి 9గంటలకల్లా తినేసి.. గుర్రుపెట్టి నిద్రపోయే వారు. ఉదయం 6 గంటలకు లేచేవారు. కేబుల్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో కొంత మార్పు వచ్చింది. రాత్రి కొద్దిగా లేట్‌గా పడుకునే వారు. ఇప్పుడు సీన్ మారింది. అర్ధరాత్రి అయినా హైదరాబాద్ సిటీ జనం నిద్రలోకి వెళ్లడం లేదు. అవును నిజం. నగరానికి నిద్రలేమి పట్టుకుంది. కొన్ని సర్వేల్లో కఠోరమైన వాస్తవాలు బయటపడ్డాయి. 32 శాతం మంది హైదరాబాద్ ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్ర కోసం ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. లేటుగా పడుకున్నా.. నిద్రపట్టకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు.
Read Also: హాయిగా నిద్రపోండి : ప్రపంచ నిద్ర దినోత్సవం

స్మార్ట్ ఫోన్లు, టీవీ, ల్యాప్ టాప్‌‌లతో సిటీ యువత బిజీ అయిపోయారు. ఉదయం లేచుడు లేచుడే.. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్ పట్టుకుని లేస్తున్నారు. ఛాటింగ్ చేయడం, మెయిల్స్ చెక్ చేసుకోవడం.. ఇతర పనులు చేసుకుంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పని. దీనితో అత్యధిక శాతం నిద్రకు దూరమవుతున్నారంట. ఆఫీసుల్లో పని, ఇంటికి వచ్చిన తరువాత అదే పని. దీంతో ప్రశాంతమైన నిద్రకు సిటీ యువత దూరం అవుతున్నారు. ఇది ఏ స్థాయిలో ఉంది అంటే.. ప్రతి 100 మందిలో.. 32 మంది నిద్రలేమితో బాధపడటం ఆందోళన కలిగించే అంశం.

ఉద్యోగులు, విద్యార్థులు, ఇంట్లో ఉండే మహిళలు, ఇలా ఏ వయస్సు వారైనా సరే.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లతో పనిచేస్తూ ఎప్పుడో అర్ధరాత్రి కునుకు తీస్తున్నారు. వీకెండ్ అయితే చెప్పనక్కర్లేదు. ఎప్పుడు నిద్రపోతారో తెలియదు. ఎప్పుడు నిద్ర లేస్తారో తెలియదు. వీళ్లే కాదు..చిన్న పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ గడిపేస్తున్నారు. వారు కూడా రాత్రి 11గంటలు దాటితే కాని నిద్రపోవడం లేదు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇది ఎంతలా చొచ్చుకపోయిందంటే.. చిన్నపిల్లలు తినేటప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ లేదా టీవీ, ల్యాప్ ట్యాప్‌లలో కార్టూన్లు చూస్తుండడం చేస్తున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రోజుకు కనీసం 6 – 8 గంటల నిద్ర కంపల్సరీ అని వైద్యులు చెబుతున్నారు. నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వయస్సు మీద పడినప్పుడు ఈ సమస్యలు అధికమౌతాయని..జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.