హుజూర్ నగర్ లో గెలుపు మాదే : కేటీఆర్

హుజూర్ నగర్ లో గెలుపు తమదేనని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. భారీ మెజార్టీతో సైదిరెడ్డి గెలుస్తారని కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. నెల రోజులుగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో పని చేసిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు పోలింగ్ ముగిసింది. (అక్టోబర్ 21, 2019) సాయంత్రం 5 గంటలకు 85శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. అప్పటికే క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కొన్ని చోట్ల మాత్రం మొదట ఈవీఎంలు మొరాయించాయి. ఎన్నికల అధికారులు వెంటనే వాటిని సరిచేశారు. ఈ నెల 24న హుజూర్‌నగర్ బైపోల్ ఫలితం వెలువడనుంది.
హుజూర్‌నగర్ నియోజకవర్గ బరిలో మొత్తంగా 28 మంది అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, బీజేపీ నుంచి డాక్టర్ కోటా రామారావు, టీడీపీ నుంచి చావ కిరణ్మయి పోటీపడ్డారు. వీరితోపాటు ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఉన్నారు. వీరంతా ఎవరికి వారే గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.